బోనకల్లు/ కొత్తగూడెం గణేశ్‌టెంపుల్/ పాల్వంచ రూరల్/ ఖమ్మం సిటీ, జూలై 7: హామీలను విస్మరించడం, సమస్యలను పరిష్కరించకపోవడం, వేతనాలు సకాలంలో చెల్లించకపోవడం, నెలల తరబడి పెండింగ్‌లో పెడుతుండడం, ప్రభుత్వం విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం వంటి ప్రభుత్వ చర్యలపై కార్మికులు భగ్గుమన్నారు. తమ సమస్యలను పరిష్కరించాల్సిందేనంటూ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో ఆయా రంగాల కార్మికులు, విద్యార్థి సంఘాల నాయకులు మంగళవారం ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. తమ సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరించే వరకూ పోరుబాట వీడేది లేదని స్పష్టం చేశారు.
బోనకల్లులో ఆశా కార్యకర్తలు..
ఎన్నికల హామీలు అమలుచేయాలని, రూ.18 వేల స్థిర వేతనం అందించాలని, ప్రతి నెలా ఒకటో తేదీనే వేతనాలు చెల్లించాలని, రూ.50 బీమా సౌకర్యం కల్పించాలని ఆశా కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ మేరకు బోనకల్లు పీహెచ్సీ ఎదుట ధర్నా నిర్వహించారు.
కొత్తగూడెంలో విద్యార్థులు..
ప్రభుత్వ విద్యాసంస్థల్లోని సమస్యలు పరిష్కరించాలని, విద్య కార్పొరేటీకరణను, కాషాయీకరణను పక్కన పెట్టాలని, ప్రైవేలు విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని విద్యార్థులు, వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ప్రదర్శన నిర్వహించారు. 10న చేపట్టిన విద్యాసంస్థల బంద్‌ను జయప్రదం చేయాలని కోరారు.

పాల్వంచలో స్వచ్ఛ ఆటో కార్మికులు..
మూడు నెలల నుంచి వేతనాలు ఇవ్వకపోతే తామెలా బతకాలని, తమ కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ‘స్వచ్ఛ’ ఆటో కార్మికులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తమకు క్రమం తప్పకుండా జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన స్వచ్ఛ ఆటోల కార్మికులు పాల్వంచలో మెరుపు సమ్మెకు దిగారు.
పెద్దాసుపత్రి ఎదుట కాంట్రాక్టు కార్మికులు..
తమకు రూ.26 వేల కనీస వేతనం ఇవ్వాలని, అదికూడా క్రమం తప్పకుండా చెల్లించాలని ఖమ్మం పెద్దాసుపత్రి కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఖమ్మం జిల్లా పెద్దాసుపత్రి ఎదుట మంగళవారం ఆందోళన చేపట్టారు. పారిశుధ్య కాంట్రాక్టర్ గడువు ముగిసినప్పటికీ పాత పద్ధతినే కొనసాగిస్తున్నారని ఆరోపించారు. రెండు, మూడు నెలలకోసారి వేతనాలు ఇవ్వడం వల్ల తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.