నిజామాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కామారెడ్డి జనంతో హోరెత్తింది. పట్టణానికి అన్ని వైపులా రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. కామారెడ్డి అసెంబ్లీ నియోజకవవర్గం నుంచి పోటీ చేస్తున్న కేసీఆర్ నామినేషన్ దాఖలు కార్యక్రమం గురువారం అట్టహాసంగా జరిగింది. అనంతరం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో అశేషజనం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు అపూర్వ స్వాగతం లభించింది. కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నట్లుగా ప్రకటించాక తొలిసారి ఈ ప్రాంతానికి గులాబీ బాస్ రావడంతో అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి మద్దతును తెలియజేశారు. ‘జై కేసీఆర్’ అంటూ నినదించారు. తెలంగాణ జాతిపిత కేసీఆర్‌పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. కుండబద్దలు కొట్టినట్లుగా బీఆర్ఎస్ పార్టీకే మద్దతు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించిన తొలి నాళ్లలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి వచ్చిన స్పందన అంతా ఇంతా కాదు. కేసీఆర్ వెంటే నడుస్తూ సమైక్య పాలకులకు వ్యతిరేకంగా స్వరాష్ట్రం కోసం పెద్దఎత్తున పోరు చేసిన చరిత్ర ఈ గడ్డ సొంతం. టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత ఎదురైన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయాలు సాధించి కామారెడ్డి నియోజకవర్గం చరిత్రకెక్కింది. ఇప్పుడిదే ప్రాంతం నుంచి కేసీఆర్ స్వయంగా అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తుండడంతో ప్రజల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తున్నది. స్వచ్ఛందంగా మద్దతు తెలిపి నాటి ఉద్యమ స్ఫూర్తిని చాటుతున్నారు. ఇందులో భాగంగా కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు జనం పోటెత్తారు.
కామారెడ్డి నియోజకవర్గ ప్రజలు కేసీఆర్‌కు బ్రహ్మరథం పట్టారు. ప్రజా ఆశీర్వాద సభకు ఊహించని రీతిలో తరలివచ్చిన జనాలతో ప్రభుత్వం డిగ్రీ కళాశాల మైదానం కిటకిటలాడింది. సభా సమయానికి ముందే ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి కేసీఆర్‌ను కళ్లారా చూసేందుకు నిరీక్షించారు. వేదికపైకి సీఎం రావడంతోనే ఈలలు, కేకలు వేస్తూ సంతోషం వ్యక్తం చేశారు. మహిళలు, వృద్ధులు తమ పెద్ద కొడుకును కేసీఆర్ రూపంలో చూసుకుంటూ మురిసి పోయారు. కేసీఆర్ అభివాదానికి కేరింతలతో ప్రతిస్పందించారు. కామారెడ్డి గడ్డ గొప్పతనం గురించి చెప్పడంతోపాటు ఉద్యమ ప్రస్థానంలో ఈ ప్రాంతం పోషించిన పాత్రను కేసీఆర్ వివరించడం అందరినీ కట్టి పడేసింది. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చాక కామారెడ్డి అభివృద్ధిపై కేసీఆర్ ఇచ్చిన హామీలు విశేషంగా ఆకట్టుకున్నాయి. గులాబీ దళపతి రాకతో కామారెడ్డి నియోజకవర్గ ప్రజల్లో మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి తీరుతెన్నులపై అంచనాలు భారీగా పెరిగాయి. అందుకు తగ్గట్లుగానే కేసీఆర్ సైతం ప్రకటన చేయడంతో జనంలో సరికొత్త జోష్ కనిపించింది.
కామారెడ్డిలో కేసీఆర్ నామినేషన్ అట్టహాసంగా కొనసా గింది. కార్యక్రమంలో భారీ సంఖ్యలో జనాలు పాల్గొన్నారు. దారి పొడవునా ఉద్యమ నాయకుడికి ఘన స్వాగతం పలుకుతూ, అభివాదం చేస్తూ సందడి చేశారు. ముసలి, ముతక, యువత, మహిళలు గులాబీ జెండాలు పట్టుకొని కేసీఆర్ సభకు తరలి వచ్చారు. బీఆర్ఎస్ అధినేత రాకతో కామారెడ్డి పట్టణం గులాబీమయమైంది. ఎటు చూసినా పార్టీ శ్రేణులు, ప్రజలతో పుర వీధులన్నీ కిక్కిరిసి కనిపించాయి. డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన సభకు నియోజకవర్గంలోని మొత్తం 8 మండలాల నుంచి జనం పెద్దఎత్తున తరలి రావడంతో ప్రతిపక్షాల్లో వణుకు మొదలైంది. మోటర్ సైకిళ్లు, కార్లు, ఆటోలు, బస్సుల్లో సభకు వచ్చారు. గులాబీ కండువాలు మెడలో వేసుకుని దర్జాగా సభకు హాజరై కేసీఆర్‌కు జై కొడుతూ కనిపించారు. రాష్ర్టాన్ని తెచ్చిన నాయకుడే కామారెడ్డికి రావడంతో జనంలో పట్టరాని సంతోషం కనిపించింది. ఇంతకు మునుపు ఎన్నోసార్లు కేసీఆర్ ఈ ప్రాంతానికి వచ్చినప్పటికీ.. స్థానిక ఎమ్మెల్యే స్థానానికి బరిలో నిలువడంతో ఈసారి పర్యటన ప్రాధాన్యతను సంతరించుకున్నది. తమ అధినేత నామినేషన్ ఘట్టంలో పాలుపంచుకునేందుకు ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు, నాయకులు తరలివచ్చారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో పాటుగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానిక బీఆర్ఎస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.