మంచిర్యాల, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జోరు కనిపించింది. మొత్తం 10 మున్సిపాలిటీల్లో ఐదింటిలో కారు దూసుకుపోయింది. మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లి మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇక్కడ మొత్తం 22 స్థానాల్లో బీఆర్ఎస్ 10, బీఆర్ఎస్ మిత్రపక్షం సీపీఐ 4 స్థానాల్లో గెలిచాయి. కాంగ్రెస్ 7, ఇతరులు ఒక స్థానంలో విజయం సాధించారు. దీంతో క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో గులాబీజెండా ఎగిరింది. ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో మొత్తం 20 స్థానాలకు బీఆర్ఎస్ 9 స్థానాల్లో గెలిచింది.
కాంగ్రెస్ 7 స్థానాలతో సరిపెట్టుకోగా.. స్వతంత్య్ర అభ్యర్థులు 4 చోట్ల గెలుపొందారు. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థులు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తే ఆ పార్టీ మున్సిపల్ చైర్మన్ పదవిని కైవసం చేసుకునే అవకాశాలున్నాయి. కాగజ్‌నగర్‌లో మొత్తం 30 స్థానాలకు బీఆర్ఎస్ 11 స్థానాల్లో గెలిస్తే, కాంగ్రెస్ 9, బీజేపీ 5 స్థానాలతో సరిపెట్టుకున్నాయి. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థులు నలుగురు, ఎంఐఎం నుంచి ఒకరు గెలిచారు. ఏ పార్టీ మ్యాజిజ్ ఫిగర్ అందుకోలేకపోవడంతో స్వతంత్రులు కీలకంగా మారారు. బెల్లంపల్లి మున్సిపాలిటీలో మొత్తం 34 స్థానాలు ఉండగా, కాంగ్రెస్, బీఆర్ఎస్ 14 చొప్పున స్థానాల్లో గెలిచాయి.
బీజేపీ ఒకటి, ఇతరులు ఐదు స్థానాల్లో గెలిచారు. ఇక్కడ కూడా స్వతంత్రులు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తే ఆ పార్టీ మున్సిపల్ కైవసం చేసుకునే అవకాశాలున్నాయి. నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లోనూ బీఆర్ఎస్ సత్తా చాటింది. మొత్తం 12 స్థానాల్లో కాం గ్రెస్ 3, బీఆర్ఎస్ 4, బీజేపీ 4 , ఒక స్థానంలో ఇతరులు గెలిచారు. దీంతో మున్సిపల్ చైర్మన్ ఎవరన్నది ఆసక్తిగా మారింది. కాంగ్రెస్ పార్టీ లక్షెట్టిపేట, చెన్నూర్, నిర్మల్ మున్సిపాలిటీల్లో స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. ఆదిలాబాద్‌లో బీజేపీ, భైంసాలో ఎంఐఎం, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో అధికార పార్టీ స్పష్టమైన ఆధిక్యం సాధించాయి.