రామ్చరణ్-ఉపాసన దంపతులకు ఇటీవలే కవలలు పుట్టిన విషయం తెలిసిందే. బుధవారం నాడు చిన్నారులకు నామకరణం చేశారు. మెగాస్టార్ చిరంజీవి అసలు పేరు శివశంకర వరప్రసాద్ కలిసి వచ్చేలా బాబుకు శివరామ్ అని, పాపకు అన్వీరా దేవి అని పేర్లు పెట్టారు. తాజా ఇంటర్వ్యూలో వారి పేర్లకు అర్థాన్ని వివరించారు రామ్చరణ్. ‘పిల్లలకు పేర్లు పెట్టే విషయంలో ఉపాసన, నేను బాగా ఆలోచించాం. మా అమ్మానాన్న సలహాలు తీసుకున్నాం.
ముఖ్యంగా పేర్లలో ఆధ్యాత్మిక భావాలు ప్రతిఫలించాలని భావించాం. శివుడు, రాముడి పేర్లతో పాటు నాన్న పేరు కలిసొచ్చేలా బాబుకి శివరామ్ అని పేరు పెట్టాం. పాప పేరు అన్వీరా దేవి. ‘అన్’ అంటే అపరిమితమైన, వీర అంటే ధైర్యం. అపరిమితమైన ధైర్యానికి, శక్తికి ప్రతీకలా ఈ పేరు పెట్టాం’ అని రామ్చరణ్ తెలిపారు. చిరంజీవి సైతం బారసాల ఫొటోను తన సోషల్మీడియా ఖాతాలో పంచుకున్నారు. రామ్చరణ్-ఉపాసనలకు తొలి సంతానంగా కుమార్తె క్లీంకార జన్మించిన విషయం తెలిసిందే. ఇప్పుడు వీరి ఆనందాన్ని రెండింతలు చేస్తూ కవలలు పుట్టారు.