హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ) : మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్‌యాదవ్ విమర్శించారు. శుక్రవారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. తాను రాజకీయాల్లోకి వచ్చి 35 ఏండ్లు అవుతున్నదని, అద్భుతమైన పాలన అందిస్తే లోకల్‌బాడీ ఎన్నికల ఫలితాలు ప్రభుత్వానికి వన్‌సైడ్ గా వస్తాయని పేర్కొన్నారు. కొన్ని చానళ్లు పని గట్టుకుని వార్ వన్‌సైడ్ అంటూ అధికార పార్టీకి అనుకూలంగా కథనాలు ప్రసారం చేస్తున్నాయ ని మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో 85-90% స్థానాలు గెలిస్తే వార్ వన్‌సైడ్ అవుతుందని తెలిపారు. గత రెండు పర్యాయాలు కేసీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నిక ల్లో సాధించిన విజయాల సంగతేమిటని ప్ర శ్నించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కేటీఆర్, హరీశ్‌రావు తమ తమ సొంత జిల్లాలకే పరిమితమయ్యారని గుర్తుచేశారు. కొంతమంది నేతలు రిక్వెస్ట్ చేస్తేనే పక్క నియోజకవర్గాలకు వెళ్లి ప్రచారం చేశారని తెలిపారు.
సీఎం రేవంత్ మాత్రం అన్ని జిల్లాలకు వెళ్లి ప్రచారం చేశారని తలసాని గుర్తుచేశారు. అయి నా ఆశించిన ఫలితాలను కాంగ్రెస్ సాధించలేదని పేర్కొన్నారు. జిల్లా కేంద్రాల్లో బహిరంగ సభలు ఏర్పాటుచేసిన కాంగ్రెస్.. ఆ సభా వేదిక పక్కనే అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయడమేంటి? అని ప్రశ్నించారు. కాంగ్రె స్ నాయకులంతా విచ్చలవిడిగా డబ్బులు పంచారని ఆరోపించారు. మొత్తం 7 కార్పొరేషన్లలో కాంగ్రెస్ మూడు కార్పొరేషన్లు గెలిస్తే వార్ వన్‌సైడ్ ఎలా అవుతుందని ప్రశ్నించారు. గెలిచిన అభ్యర్థులను కాంగ్రెస్ నాయకులు పోలీసు ల ఎదుటే ఎత్తుకెళ్తున్నారని మండిపడ్డారు. ఖమ్మంలో ముగ్గురు మంత్రులున్నారని, కొత్తగూడెం మేజర్ కార్పొరేషన్లో కాంగ్రెస్ పని తనం ఏ పాటిదో చూశామని చురకలు అంటించారు. పంచాయతీ ఎన్నికల్లో సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేసినా.. బీఆర్ఎస్ పార్టీకి 35-40% ఓట్లు వచ్చాయని గుర్తుచేశారు. నాడు సీఎంగా కేసీఆర్, మంత్రిగా కేటీఆర్ హయాంలో ప్రారంభించిన పనులకే నేడు కాంగ్రెస్ నాయకులు శంకుస్థాపనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ‘నేనే రాజు నేనే మంత్రి’ వ్యాఖ్యలపై.. కాంగ్రెస్‌లో పుట్టి పెరిగిన నాయకులు ఆలోచించుకోవాలని సూచించారు. ప్రజలలు అన్నీ గమనిస్తున్నారని సమయం వచ్చినప్పుడు కాంగ్రెస్‌కు కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయమని పేర్కొన్నారు.