KCR | హైదరాబాద్ : పాలకులు అనుసరించే ప్రజా వ్యతిరేక విధానాలను అటు న్యాయస్థానాల్లో ఇటు క్షేత్ర స్థాయిలోనూ పోరాడి గెలవాలనే ప్రజాస్వామిక స్ఫూర్తిని చిట్యాల ఐలమ్మ తెలంగాణ సమాజానికి అందించింది అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వీరనారి చిట్యాల(చాకలి)ఐలమ్మ 130వ జయంతి సందర్భంగా వారి పోరాట స్ఫూర్తిని కేసీఆర్ స్మరించుకున్నారు.
నాటి రాచరిక పాలనలో, భూస్వామ్య పెత్తందారీ వ్యవస్థ మీద ఐలమ్మ చేసిన పోరాటం.. తెలంగాణ మహిళా చైతన్యానికి బహుజన వర్గాల ప్రజాస్వామిక, ఆత్మగౌరవ పోరాట పటిమకు నిదర్శనం అన్నారు. ఎక్కడా రాజీ పడకుండా, సబ్బండ వర్గాల అభ్యున్నతి సంక్షేమమే ప్రధానంగా గత పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో అమలు చేసిన విధానాలను, పథకాలను కొనసాగించడం ద్వారా మాత్రమే చాకలి ఐలమ్మ గారికి మనమందించే ఘన నివాళి అని కేసీఆర్ స్పష్టం చేశారు.