Ajit Pawar : మహారాష్ట్ర (Maharastra) డిప్యూటీ సీఎం (Deputy CM) అజిత్ పవార్ (Ajit Pawar) మరోసారి నోరుజారారు. ఇటీవల ఓ మహిళా ఐపీఎస్ అధికారితో బెదిరింపు ధోరణిలో మాట్లాడటం, గోవా మాజీ సీఎం అయిన దివంగత మనోహర్ పారికర్ ప్రస్తావన రాగా ఆయన ఎవరంటూ ప్రశ్నించడం.. పవార్ నోటిదురుసును బయటపెట్టాయి. ఈ నేపథ్యంలో తాజాగా వరద బాధితులను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయి.
ఈ మధ్య భారీ వర్షాలు కురుస్తుండటంతో మహారాష్ట్రలోని అనేక ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయి. ఈ క్రమంలో వరద బాధితులను పరామర్శించేందుకు డిప్యూటీ సీఎం అజిత్ పవార్.. ధారాశివ్ జిల్లాలోని ఓ గ్రామానికి వెళ్లారు. వారిని పరామర్శిస్తున్న సమయంలో ‘వరద బాధిత రైతులకు రుణమాఫీ చేస్తారా..?’ అని ఓ రైతు ప్రశ్నించాడు. దాంతో డిప్యూటీ సీఎం పవార్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ‘నిన్ను సీఎంను చేయమంటావా మరి..?’ అంటూ ఆ రైతుపై అసహనం వ్యక్తంచేశారు.
‘రైతులకు రుణమాఫీ చేయాలా.. వద్దా..? అనే విషయం మాకు తెలియదా..? నేనేమైనా ఇక్కడ గోటీలు ఆడటానికి ఉన్నానా..’ అని మండిపడ్డారు. ఉదయం నిద్రలేచినప్పటి నుంచి తాను ప్రజల కోసం పని చేస్తున్నానని, అలాంటిది తననే ప్రశ్నిస్తారా..? అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటికే ‘లడ్కీ బహిన్ యోజన’ కింద రూ.45 వేల కోట్లు ఇస్తున్నామని, రైతులకు విద్యుత్ ఛార్జీలను మాఫీ చేశామని, వరద ప్రభావిత ప్రాంతాలకు రూ.2,215 కోట్ల సాయం ప్రకటించామని కఠిన స్వరంతో చెప్పారు.
అనంతరం పవార్.. ఇంకా తాను పరిశీలించాల్సిన ప్రాంతాలు చాలా ఉన్నాయంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. దాంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.