టేక్మాల్, సెప్టెంబర్ 26 : అధికారంతో అడ్డదారిన అంధలం ఎక్కిన చైర్మన్ పదవి కాంగ్రెస్ పార్టీకి మూడునాళ్ల ముచ్చటగానే మిగిలింది. పాత పాలక వర్గమే యథాతథంగా కొనసాగుతుందని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో మెదక్ జిల్లా టేక్మాల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్గా యశ్వంత్ రెడ్డి కొనసాగనున్నారు. గతంలో జరిగిన సొసైటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి యశ్వంత్ రెడ్డి డైరక్టర్గా గెలుపొంది చైర్మన్ గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి.
పార్టీ మారాలని ఒత్తిడి..
సొసైటీ చైర్మన్గా కొనసాగాలంటే అధికార పార్టీ కాంగ్రెస్లో చేరాలని ఒత్తిడి తెచ్చారు. పార్టీ మారనని చెప్పడంతో పలువురు డైరక్టర్లతో అవినీతి ఆరోపణలు చేసి ఫిర్యాదు చేశారు. ఆరోపణల నేపథ్యంలో విచారణ కొనసాగు తుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా సొసైటీల పాలకవర్గం పదవి కాలం పూర్తయినా ఎన్నికలు జరగకపోవడంతో పాత పాలకవర్గానికి గడువు పొడిగించింది. చైర్మన్ పదవిపై కన్నేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ఇంకా విచారణ కొనసాగుతున్న క్రమంలో అధికారులపై ఒత్తిడి తెచ్చారు.
ఫలితంగా ఈ నెల 9వ తేదీన డైరక్టర్ నర్సింహారెడ్డికి సొసైటీ చైర్మన్గా ఇన్చార్జి బాధ్యతలు ఇస్తూ డీసీవో కరుణాకర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉదయం ఇచ్చిన ఉత్తర్వులను అదే రోజున సాయంత్రం మళ్లీ క్యాన్సల్ చేశారు. ఏం జరిగిందో తెలియదు కానీ, 11వ తేదీన నర్సింహారెడ్డి ఇన్చార్జీగా కొనసాగుతున్నట్లు డీసీవో మళ్లీ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆయన బాధ్యతలను చేపట్టారు. ఎందుకు ఇచ్చారు ? ఎందుకు క్యాన్సల్ చేశారు? మళ్లీ ఎందుకు ఇచ్చారు? అనే విషయం అప్పట్లో జిల్లా వ్యాప్తంగా చర్చానీయాంశమైంది.
అక్రమ పద్దతుల్లోకి అధికారంలోకి..
అవినీతి ఆరోపణలు రుజువు కాకముందే విచారణ కొనసాగుతున్న సమయంలో అక్రమంగా వేరే వారికి చైర్మన్ పదవి కట్టబెట్టారని హైకోర్టును ఆశ్రయించినట్లు యశ్వంత్ రెడ్డి తెలిపారు.దీంతో పాత పాలక వర్గం అంటే 14.08.2025 నాటికి పదవుల్లో ఉన్న పాలకవర్గమే కొనసాగుతుందని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలిపారు. 11.09.2025 నాడు డీసీవో ఇచ్చిన ఉత్తర్వులు చెల్లనేరవని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు చెప్పారు. హైకోర్టు ఉత్తర్వులను అనుసరించి తాను సొసైటీ చైర్మన్గా కొనసాగుతానని ఆయన తెలిపారు.