బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మర్యాదపూర్వకంగా కలిశారు. తనపై నమ్మకం ఉంచి తనను పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఎంపిక చేసిన బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, సహకరించిన కేటీఆర్‌కు వద్దిరాజు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్రకు కేటీఆర్ పుష్పగుచ్ఛం అందించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
వద్దిరాజు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్‌గా వ్యవహరిస్తున్నారు. పార్టీ పార్లమెంటరీ ఫ్లోర్ లీడర్‌గా వ్యవహరించిన కేఆర్ సురేశ్‌రెడ్డి పదవీకాలం ఇటీవల ముగిసిన నేపథ్యంలో ఆయన స్థానంలో వద్దిరాజును ఎంపిక చేశారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన రవిచంద్ర బహుజనులకు, పార్టీకి అందిస్తున్న సేవలను గుర్తించిన కేసీఆర్ రెండోసారి రాజ్యసభకు ఎంపిక చేశారు. గతంలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్న డాక్టర్ బండ ప్రకాశ్ ముదిరాజ్ శాసనమండలికి వెళ్లారు. ఆయన స్థానంలో తొలిసారి వద్దిరాజును రాజ్యసభకు పంపించారు. తాజాగా రెండోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆయనతోపాటు రాజ్యసభలో బీఆర్ఎస్ సభ్యులుగా దీవకొండ దామోదర్‌రావు, బండి పార్థ సారథిరెడ్డి కొనసాగుతున్నారు. రవిచంద్ర 2030 ఏప్రిల్ వరకు ఈ బాధ్యతల్లో కొనసాగనున్నారు. ప్రస్తుతం ఆయన పెట్రోలియం, సహజవాయువు పార్లమెంటరీ స్థాయీసంఘం, బొగ్గు గనుల శాఖ సంప్రదింపుల కమిటీ సభ్యులుగా వ్యవహరిస్తున్నారు.
తనపై నమ్మకం ఉంచి తనను పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఎంపిక చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, సహకరించిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు వద్దిరాజు కృతజ్ఞతలు తెలియజేశారు. బలహీన వర్గాలకు చెందిన తనను రెండుసార్లు రాజ్యసభకు పంపించడమే కాకుండా పార్లమెంటరీ పార్టీ నేతగా నియమించడం ఎంతో సంతోషంగా ఉన్నదని చెప్పారు. తనపై ఉంచిన గురుతర బాధ్యతను వినమ్రంగా స్వీకరిస్తానని, తెలంగాణ ప్రజల గొంతును పార్లమెంట్లో మరింత బలంగా వినిపిస్తానని తెలిపారు. పార్టీ పటిష్టానికి, కేసీఆర్‌ను మూడోసారి ముఖ్యమంత్రిగా చేసేందుకు శక్తివంచనలేకుండా కృషి చేస్తానని ఉద్ఘాటించారు.