Chennai Love Story | టాలీవుడ్లో రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘చెన్నై లవ్ స్టోరీ’ విడుదలకు ముందే ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. యువ హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు సాయి రాజేష్ కథ, స్క్రీన్‌ప్లే అందించగా, ఎస్కేఎన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార కంటెంట్‌కు మంచి స్పందన రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ చిత్రాన్ని జూలై 24న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. అయితే అదే రోజున తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన భారీ చిత్రం ‘జననాయగన్’ కూడా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్లు సమాచారం. దీంతో బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పోటీ నెలకొనే అవకాశం కనిపిస్తోంది.
‘జననాయగన్’ అనేక వాయిదాల తర్వాత విడుదలకు సిద్ధమవుతుండగా, ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు కూడా జూలై 24 విడుదల తేదీని ధృవీకరిస్తూ ప్రచారం ప్రారంభించారు. విజయ్ సినీ కెరీర్లో చివరి చిత్రంగా ప్రచారం జరుగుతుండటంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా తమిళనాడుతో పాటు విదేశాల్లో కూడా ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇలాంటి భారీ క్రేజ్ ఉన్న చిత్రం అదే రోజున విడుదల కావడం వల్ల చెన్నై లవ్ స్టోరీకి తమిళ మార్కెట్లో కొంత ప్రభావం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమిళ ప్రేక్షకుల దృష్టి ఎక్కువగా ‘జననాయగన్’పై ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే ‘చెన్నై లవ్ స్టోరీ’ ప్రధాన లక్ష్యం తెలుగు ప్రేక్షకులే కావడంతో, తెలుగు రాష్ట్రాల్లో సినిమా మంచి ఆదరణ పొందుతుందనే నమ్మకంతో చిత్రబృందం ఉంది. అందుకే విడుదల తేదీని మార్చే ఆలోచన ప్రస్తుతం లేదని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మంచి ప్రేమకథ, భావోద్వేగాలు, వినోదంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం యువ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే ఆశతో మేకర్స్ ఉన్నారు. మరోవైపు భారీ అంచనాల మధ్య వస్తున్న ‘జననాయగన్’తో ఒకే రోజు విడుదల కావడం సినిమాకు సవాల్‌గా మారనుంది. ఇప్పుడు ప్రేక్షకుల్లో నెలకొన్న ఆసక్తికరమైన ప్రశ్న ఒక్కటే.. భారీ పోటీని తట్టుకుని కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’ బాక్సాఫీస్ వద్ద తనదైన విజయాన్ని నమోదు చేస్తుందా? లేక విజయ్ సినిమా హవా మధ్య నిలదొక్కుకుంటుందా? అనేది విడుదల తర్వాతే తేలనుంది.