హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో వానకాలం సాగుకు రైతులకు అవసరమైన ఎరువులు, యూరియాను సకాలంలో అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర కోరారు. రాజ్యసభ జీరో అవర్‌లో ఆయన గురువారం ఈ అంశాన్ని లేవనెత్తారు. ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయరంగమే కీలకమని, ఈ క్రమంలో రైతులకు అండగా నిలువాలని కోరారు.
నిరుటి కష్టాలు పునరావృతం కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. గత ఖరీఫ్‌లో తీవ్ర యూరియా కొరత కారణంగా రైతులు గంటల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సి వచ్చిందని తెలిపారు. ఈ నేపథ్యంలో కొందరు సృ్పహ తప్పి పడిపోవడం, తోపులాటలో ప్రాణాలు కోల్పోవడం వంటి బాధాకర సంఘటనలు జరిగాయని ఎంపీ సభ దృష్టికి తెచ్చారు.
గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని, ఈసారి కేంద్రం ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని ఆయన కోరారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి మేరకు కేంద్రం అదనపు నిల్వలు విడుదల చేసి, పరిస్థితిని మెరుగుపరిచిన విషయాన్ని గుర్తుచేశారు. యూరియా బ్లాక్ మారెటింగ్, అక్రమ నిల్వలను కఠినంగా అణచివేయాలని, రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ప్రతి మండల, జిల్లా కేంద్రంల్లోనూ బఫర్ నిల్వలను ఉంచేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.