హైదరాబాద్, జూలై 30: దేశీయ ఎలక్ట్రిక్ బస్సుల విభాగంలో ఒలెక్ట్రా గ్రీన్టెక్ మరో చారిత్రక మైలురాయిని అధిగమించింది. కంపెనీకి చెందిన 4 వేల ఈ బస్సులు దేశీయ రోడ్లపై పరుగులు పెడుతున్నాయి. ఈ ఘనత సాధించిన తొలి దేశీయ సంస్థ ఒలెక్ట్రా కావడం విశేషం. కంపెనీకి చెందిన 4 వేల ఎలక్ట్రిక్ బస్సును హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖవిందర్ సింగ్నకు కంపెనీ ఎండీ మహేశ్ బాబు గురువారం అందచేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రస్తుతం దేశంలోని పలు రాష్ర్టాల్లో 4 వేల ఎలక్ట్రిక్ బస్సులు సేవలు అందిస్తున్నాయని, ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారన్నారు. వీటితో ఈ-బస్సుల ప్రయాణం 73 కోట్ల గ్రీన్ కిలోమీటర్లు దాటిందని, దీంతో 6.5 లక్షల టన్నులకు పైగా కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు తగ్గి, పర్యావరణ పరిరక్షణకు దోహదం చేసిందన్నారు.