హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): ‘నీట్ పరీక్ష పేపర్ లీక్ ఘటన అనంతరం దేశవ్యాప్తంగా 20 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకొన్నారు. మృతిచెందిన ఆ విద్యార్థుల కుటుంబాలకు తగిన నష్టపరిహారం ఇవ్వడంతోపాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగవకాశం కల్పించాలి’ అని కేంద్ర ప్రభుత్వాన్ని రాజ్యసభలో బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర డిమాండ్ చేశారు.
ప్రజాపరీక్షలు (అక్రమ మార్గాల నివారణ) సవరణ బిల్లు-2026కు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్టు ఆయన వెల్లడించారు. గురువారం రాజ్యసభలో ఆ బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన పలు అంశాలను సభ దృష్టికి తెచ్చారు. పరీక్ష అనేది కేవలం ప్రశ్నాపత్రం కాదని, అది ఒక విద్యార్థి జీవిత లక్ష్యమని, మని, తల్లిదండ్రుల కన్నీరు, చెమట అని ఉద్వేగంగా పేరొన్నారు.
పరీక్షల్లో పేపర్లు లీక్ చేయడం కేవలం చట్టాన్ని ఉల్లంఘించడం మాత్రమే కాదని, దేశ యువత నమ్మకాన్ని దెబ్బతీయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. నీట్ లీకేజీకి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమానికి, నిరసనలకు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. జంతర్ మంతర్‌లో ఆందోళనలో పోలీసుల లాఠీచార్జీ, బాష్పవాయు ప్రయోగం, పెల్లెట్‌గన్స్ కాల్పుల్లో గాయపడిన విద్యార్థుల వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అన్ని జాతీయస్థాయి పరీక్షలకు సైబర్ భద్రతా ప్రమాణాలు, ఎన్ క్రిప్టెడ్ నిర్వహణ, ఏఐ పర్యవేక్షణ, స్వతంత్ర ఆడిట్లు ఒకేవిధంగా వర్తించేలా ‘జాతీయ పరీక్షల సమగ్ర విధానం’ తేవాలని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర డిమాండ్ చేశారు. లక్షలాది మంది యువత రాసే పోటీ పరీక్షల్లో నిజాయితీగా చదివితే ఉద్యోగం వస్తుందనే నమ్మకం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నదని హితవు పలికారు. ఉద్యోగాల భర్తీలో జాప్యం, పరీక్షలు రద్దయినప్పుడు విద్యార్థులు ఎదురొనే మానసిక ఒత్తిడికి ప్రభుత్వం ప్రత్యేక కౌన్సెలింగ్, సహాయం అందించాలని సూచించారు. నిజాయితీగా చదివే ఒక విద్యార్థి కూడా వ్యవస్థ వైఫల్యానికి బలి కాకూడదని కోరారు.
డిజిటల్ భద్రత: సైబర్ సెక్యూరిటీ, ఎన్ క్రిప్టెడ్ డిజిటల్ ట్రాన్స్మిషన్, బయోమెట్రిక్ యాక్సెస్, జియో-ట్యాగింగ్, ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పర్యవేక్షణ వంటి ఆధునిక భద్రతా వ్యవస్థలను తప్పనిసరి చేయాలి.
స్వతంత్ర భద్రతా ఆడిట్: ప్రతి పరీక్షకు ముందు స్వతంత్ర సైబర్ సెక్యూరిటీ ఆడిట్ నిర్వహించాలి.
అధికారుల బాధ్యత: ప్రశ్నాపత్రాల భద్రతలో నిర్లక్ష్యం వహించి పేపర్ లీక్‌కు కారణమైన అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకొనేలా చట్టంలో స్పష్టమైన నిబంధనలు ఉండాలి.
నందన్ నీలేకని నియామకంపై అపేక్ష: ఆధార్ రూపకర్త నందన్ నీలేకని నేతృత్వంలో టాస్‌ఫోర్స్ ఏర్పాటును స్వాగతిస్తున్నామని, రాధాకృష్ణన్ కమిషన్ సిఫారసుల మాదిరిగా దీనిని విస్మరించకూడదని కోరారు.
మౌలిక వసతులు: చట్టంలో పేరొన్న గడువులోగా దర్యాప్తు, విచారణ పూర్తి కావాలంటే రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన దర్యాప్తు అధికారులు, డిజిటల్ ఫోరెన్సిక్ నిపుణులు, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, ఫాస్ట్‌ట్రాక్ కోర్టులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలి.