MLC Dasoju Sravan | హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో రాజ్యాంగబద్ధంగా గెలిచినట్లు నటించిన సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీకి బలముంటే అజారుద్దీన్‌కు టికెట్ ఎందుకివ్వలేదు అని రేవంత్ రెడ్డిని ఆయన నిలదీశారు. తెలంగాణ భవన్లో దాసోజు శ్రవణ్ మీడియాతో మాట్లాడారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి చాలా సర్వేల్లో రేవంత్ రెడ్డి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రాబల్యం కంటే నవీన్ యాదవ్‌కు ప్రాబల్యం ఎక్కువ అని తేలింది. మళ్లా నేను(రేవంత్ రెడ్డి) గెలిచినట్లు ప్రజలను మభ్య పెడుతున్నారు. ఒక వేళ నిజంగా ఆయన నేతృత్వంలో పని చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి బలముంటే అజారుద్దీన్‌కు ఎందుకు టికెట్ ఇవ్వలేదు. ఎంఐఎం నుంచి ఓడిపోయినా నవీన్ యాదవ్‌కు టికెట్ ఇచ్చారు. అంటే మీ పార్టీ గెలుస్తదన్న నమ్మకం నీకే లేదు అని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి దాసోజు శ్రవణ్ వ్యాఖ్యానించారు.
కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కూడా బీజేపీ గణేశ్‌ను పట్టుకొచ్చిటికెట్ ఇచ్చారు. గద్దర్‌ను వాడుకుని ఆయన బిడ్డకు ఉప ఎన్నికలో టికెట్ ఇవ్వలేదు. గద్దర్ మీద గౌరవం ఉంటే, ప్రజాపాలనపై విశ్వాసం ఉంటే గద్దర్ బిడ్డ వెన్నెలకు టికెట్ ఇవ్వాలి. కానీ ఉప ఎన్నికలో గణేశ్‌కు టికెట్ ఇచ్చారు. జూబ్లీహిల్స్‌లో కూడా అజారుద్దీన్‌కు టికెట్ ఇవ్వకుండా నవీన్ యాదవ్‌కు టికెట్ ఇచ్చారు. సొంత పార్టీలో ఉన్న వారిని ఖతం చేస్తూ బీజేపీ, ఎంఐఎం వారితో కొమ్ముకాస్తున్నారు రేవంత్ రెడ్డి. జూబ్లీహిల్స్‌లో నవీన్ యాదవ్ గెలిచాడు.. రేవంత్ రెడ్డి గెలవలేదు.. నా పథకాలు అమలు చేయకపోయినా గెలిచానని రేవంత్ రెడ్డి అనుకుంటే పొరపాటు అని దాసోజు శ్రవణ్ సూచించారు.
పదేండ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. గెలుపోటమలు అనేది ప్రజాస్వామ్యంలో నిరంతరం జరిగే ప్రక్రియ. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు మీద రేవంత్ రెడ్డి దాడి చేశాడు. మీడయా వారిని కూడా బెదిరింపులకు గురి చేశాడు. కొడంగల్‌లో ఓడిపోయావు. మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఎన్ని కార్పొరేటర్లు గెలిచావు. గెలిచిన పరమేశ్వర్ రెడ్డి, సోమశేఖర్ రెడ్డి స్వయం ప్రకాశిత లీడర్లు.. పవర్ ఫుల్ లీడర్లు.. కాబట్టి గెలిచారు. మల్కాజ్గిరి నియోజకవర్గంలో 44 సీట్లు ఉంటే ఒక్కటంటే ఒక్కటి గెలవలేదు. డిపాజిట్లు కూడా రాలేదు. ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అసదుద్దీన్ కాళ్లు మొక్కి, బండి సంజయ్‌తో కుమ్మక్కై బీజేపీ ఓట్లన్నీ బదిలీ చేసి, బోగస్ ఓట్లతో గెలిచిండు రేవంత్ రెడ్డి అని దాసోజు శ్రవణ్ ధ్వజమెత్తారు.