నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్ 7 : కాంగ్రెస్ వెయ్యిరోజుల అసమర్థత పాలనపై సోమవారం అసెంబ్లీకి నల్ల టీషర్టులు ధరించి వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అక్రమంగా అరెస్టు చేయడం, మహిళా ఎమ్మెల్యేలపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించడంపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నారు. రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన నడుస్తున్నదని మండిపడ్డారు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అని నిలదీశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు నల్ల చొక్కాలు ధరించి రహదారులు, కలెక్టరేట్ ఎదుట ధర్నాలు, నిరసనలతో హోరెత్తించారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ క్రమంలో పలు చోట్ల బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్‌లోనూ బీఆర్ఎస్ శ్రేణుల నిరసన జ్వాలలు ఎగసి పడ్డాయి. ఈ సందర్భంగా అమరవీరుల స్తూపం (గన్ పార్), పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ పరిసర ప్రాంతాలు ‘కాంగ్రెస్ డౌన్ డౌన్’, ‘రేవంత్ రెడ్డి నిరంకుశ పాలన నశించాలి’ అనే నినాదాలతో హోరెత్తాయి. పలు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నాయకులు, శ్రేణులు భారీ ఎత్తున రహదారులపైకి వచ్చి సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు.
