హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ) : ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మూడేండ్లు అవుతున్నా ఆ హామీని ఎందుకు నెరవేర్చలేదని నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వంపై కన్నెర్ర చేశారు. సోమవారం నిర్వహించిన అసెంబ్లీ ముట్టడికి వేలాదిగా తరలివచ్చిన నిరుద్యోగులను పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం నినదిస్తున్న నిరుద్యోగుల గొంతు నొక్కేశారు. ఈడ్చిపడేసి పోలీస్ వ్యాన్లలోకి ఎక్కించారు.
నిరుద్యోగులు మాట్లాడుతూ.. ‘పాత జాబ్ క్యాలెండర్ రద్దు చేసి, కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి. కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలి. నిరుద్యోగ భృతిని అమలుచేయాలి. పోలీసు శాఖలో ప్రస్తుతం ప్రతిపాదించిన పోస్టులను 20 వేలకు పెంచాలి. ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితి పెంచాలి’ అని డిమాండ్ చేశారు.