హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): శాసనసభ గేట్ వద్ద జరిగిన ఘటనకు సంబంధించి తనపై వస్తున్న ఆరోపణలపై ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ వివరణ ఇచ్చారు. స్పీకర్‌ను ఉద్దేశించి ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని స్పష్టంచేశారు. తెలంగాణభవన్‌లో సహచర ఎమ్మెల్సీలు ఎల్ రమణ, దాసోజు శ్రవణ్, దేశపతి శ్రీనివాస్, ఎంసీ కోటిరెడ్డితో కలిసి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. ఘటన జరిగిన తీరును తాతా మధు వివరించారు.
మహిళా శాసనసభ్యులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై కూడా దాడి జరిగిందని తెలిపారు. ‘నాపై దాడి చేసి ప్యాంటు లాగేందుకు ప్రయత్నించారు. గొంతు నొక్కుతూ చెప్పడానికి వీలులేని రీతిలో దుర్భాషలాడుతూ, తొడల్లో పిడిగుద్దులు గుద్దారు. ఈ ఘటనతో తీవ్ర ఆవేదనకు గురయ్యా. ఈ సందర్భంగానే అక్కడ దాడికి యత్నంచిన అధికారులను నిలదీసిన. నాపై దాడి చేసింది ఎవరు?.. ప్యాంటు లాగేందుకు ప్రయత్నించింది ఎవరు?.. అలా చేయమని ఎవరు ఆదేశించారని అక్కడున్న పోలీసులను ఉద్దేశించే ఆగ్రహం వ్యక్తం చేశా. కానీ స్పీకర్‌ను ఉద్దేశించి మాట్లాడలేదు. స్పీకర్ వ్యవస్థపై, వ్యక్తిగతంగా స్పీకర్‌పైనా తనకు ఎంతో గౌరవముంది.
స్పీకర్‌ను ఉద్దేశించి ఒక మాట అనలేదు. అయినప్పటికీ నేను అనని మాటలను నాకు ఆపాదించడం సరికాదు. ఒకవేళ నేను అన్న మాటల్లో ఏదైనా స్పీకర్‌ను ఉద్దేశించినట్టు భావిస్తే, ఆ మాటలను ఉపసంహరించుకుంటున్న. అందుకు విచారం వ్యక్తం చేస్తున్న’ అని తాత మధు వివరించారు. శాంతియుతంగా సభలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై, ముఖ్యంగా మహిళా శాసనసభ్యులపై పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్రంగా ఖండించాల్సిన విషయమని తాతా మధు వెల్లడించారు. మహిళా శాసనసభ్యుల చీరలు లాగడం, జుట్టు పట్టుకోవడం, గొంతు నొకడం వంటి ఘటనలు సభ్య సమాజం సిగ్గుపడేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు.
తీర్మానం చేసి పంపుతాం: స్పీకర్
సభాపతి స్థానంలో ఉన్న తనను ఉద్దేశించి ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను తేలికగా తీసుకోబోమని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ పేర్కొన్నారు. సోమవారం స్పీకర్ ప్రసాద్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ తాతా మధు అసెంబ్లీ గేట్ వద్ద తనపై చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా బాధించాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఎమ్మెల్సీ తాతా మధు వ్యాఖ్యలపై త్వరలోనే శాసనసభలో ప్రత్యేకంగా తీర్మా నం చేసి తదుపరి చర్యల కోసం శాసనమండలికి పంపుతామని స్పష్టంచేశారు.
మధుపై చర్యలు తీసుకోవాలి: గుత్తా
స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డికి మండలి చీఫ్ విప్ అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్, విజయశాంతి, శంకర్‌నాయక్, కోదండరాం, దామోదర్‌రెడ్డి, నెల్లికంటి సత్యం తదితరులు ఫిర్యాదు చేశారు.