న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7: మహారాష్ట్రలో వైద్యులు, దవాఖాన సిబ్బందిపై రాజకీయ నాయకుల దాడి ఘటనలపై సుప్రీంకోర్టు సోమవారం తీవ్ర ఆగ్రహం ప్రకటించింది. ఇటువంటి కేసులను తేలికగా పరిగణించలేమని, ఇందులో ప్రమేయం ఉన్నవారిని వెంటనే అదుపులోకి తీసుకోవాలని, వారిని స్వేచ్ఛగా తిరగనివ్వకూడదని సుప్రీంకోర్టు పేర్కొంది. మహారాష్ట్రలోని పాల్ఘర్లో ఆదివారం ఒక దవాఖానలో శివసేన కార్యకర్తలు ఒక రిసెప్షనిస్ట్‌ను చెంపదెబ్బ కొట్టి, ఒక మహిళా ఉద్యోగిని బెదిరించినట్టు ఆరోపణలు వచ్చిన ఘటన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
థాణెలోని డోంబివ్లిలో ఉన్న కేడీఎంసీ శాస్త్రీనగర్ దవాఖానలో వైద్యులు, సిబ్బందిపై దాడి చేశారన్న ఆరోపణలతో జూలై 6న అరెస్టయిన శివసేన కార్పొరేటర్ రమేశ్ సుక్రియ మాత్రే దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా అటువంటి రాజకీయ నాయకులను వెంటనే అరెస్టు చేయాలని, స్వేచ్ఛగా తిరగనివ్వకూడదని సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే, బాంబే హైకోర్టు తనకు బెయిల్ మంజూరు చేస్తూ విధించిన కఠినమైన షరతులను సవాలు చేస్తూ మాత్రే సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఆ షరతులలో ఆయన మహారాష్ట్రలో నివసించకూడదనే ఆదేశం కూడా ఉంది. ఆయన ముంబైని సందర్శించడానికి అనుమతి కోరారు. కాగా, సోమవారం నాటి విచారణ సందర్భంగా ధర్మాసనం చేసిన తీవ్ర వ్యాఖ్యల నేపథ్యంలో మాత్రే తరఫు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి అప్పీలును ఉపసంహరించుకుంటామని కోర్టుకు తెలిపారు. వైద్యులపై దాడుల ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో పరిస్థితి రోజురోజుకూ దిగజారుతున్నది అని రోహత్గీతో జస్టిస్ విక్రమ్ నాథ్ అన్నారు.
మీడియాలో వచ్చిన పాల్ఘర్ ఘటనను కూడా ధర్మాసనం ప్రస్తావించింది. నేను నా అప్పీల్‌ను ఉపసంహరించుకోవాలని భావిస్తున్నాను. 10 రోజుల్లో చార్జ్‌షీట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. నిందితునికి త్వరలోనే శిక్ష పడుతుంది అని రోహత్గి ధర్మాసనానికి తెలిపారు. అతనికి శిక్ష పడనివ్వండి. మాకు దానితో సంబంధం లేదు. కాని ఒక సందేశం సమాజానికి వెళ్లాలి అని ధర్మాసనం స్పష్టం చేసింది. మాత్రేకు బెయిల్ మంజూరు చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌ను విచారిస్తామని కూడా సుప్రీంకోర్టు సూచించింది.