మంచిర్యాల టౌన్, జూలై 10: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లలో నెలన్న సమస్యలు పరిష్కరించాలని శుక్రవారం కమిషనర్ అన్వేష్‌కు బీఆర్ఎస్ నాయకులు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పట్టణ మాజీ అధ్యక్షుడు గాదెసత్యం మాట్లాడుతూ రోడ్డువెడల్పు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు నిదానంగా జరుగుతున్నాయని, దీంతో వ్యాపారులతో పాటు పట్టణ ప్రజలు కూడా తీవ్ర అవస్థలు పడుతున్నారన్నారు. తాగునీటి సరఫరా సరిగా లేదని, చాలా డివిజన్లలో వీధి దీపాలు వెలగడం లేదని, వర్షాకాలంలో చిమ్మచీకట్లలో ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తుందని పేర్కొన్నారు.
చాలా డివిజన్లలో కోతుల బెడద, కుక్కల బెడద తీవ్రంగా ఉన్నదని, పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారిందని, రానున్న సీజనల్ వ్యాధుల సమయంలో పరిస్థితి ఇలాగే ఉంటే వ్యాధులు వ్యాప్తి చెందుతాయన్నారు. వాడల్లో రోడ్లు, డ్రైనేజీల పరిస్థితి అధ్వానంగా మారాయని, వాటికి వెంటనే మరమ్మతులు చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్పొరేటర్ సత్తార్, మాజీ కౌన్సిలర్ తోట తిరుపతి, పోరెడ్డి రాజు, నాయకులు పడాల రవీందర్, బల్లికొండ రమేశ్, జాడి భానుచందర్, జక్కం జగన్, బొడ్డు పద్మ, పుప్పాల స్వర్ణాకర్, నక్క తిరుపతి, జావిద్, శ్రీకాంత్, రమేశ్ పాల్గొన్నారు.