పరిగి, ఏప్రిల్ 7 : బీఆర్ఎస్ నేతలపై నిర్బంధం కొనసాగుతున్నది. ఇండస్ట్రియల్ పార్కు పేరిట తమ భూములు గుంజుకోవద్దని పేర్కొంటూ పక్షం రోజులుగా పరిగి మండలం కాళ్లాపూర్, రాపోల్ గ్రామాల రైతులు రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. ఈ క్రమంలో వారికి సంఘీభావంగా బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు వస్తున్న నేపథ్యంలో మంగళవారం పోలీసులు ఎక్కడికక్కడ నిర్బంధం విధించి బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేశారు. మంగళవారం తెల్లవారుజాము నుంచే ఈ అరెస్టుల పరంపర కొనసాగింది. ముందుగా పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డిని పరిగి ఎస్ఐ మోహన్ కృష్ణను అరెస్టు చేసి ధారూర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
అక్కడి నుంచి వివిధ గ్రామాల మీదుగా తిప్పుతూ బంట్వారం పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. సాయంత్రం వరకు అక్కడే ఉంచారు. పరిగి పట్టణం, మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పరిగి మున్సిపల్ మాజీ చైర్మన్ ముకుంద అశోక్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఆర్ ఆంజనేయులు, పీఏసీఎస్ మాజీ వైస్ చైర్మన్ ఎస్ భాస్కర్, కౌన్సిలర్లు మీదిగడ్డ శ్రీనివాస్, బీ రవికుమార్, కే నరేశ్, మాదారం సర్పంచ్ రాములు, బీఆర్ఎస్ నాయకులు మహేందర్‌ను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. చౌడాపూర్ మండల బీఆర్ఎస్ నాయకులను కూడా అదుపులోకి తీసుకున్నారు.

తమ సర్పంచ్, గ్రామస్తులను వదిలిపెట్టాలంటూ మహిళా రైతులు ఏకంగా పరిగి పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. పరిగిలో రైతులకు సంఘీభావంగా హరీశ్‌రావు సభకు అనుమతి ఇవ్వాలంటూ కాళ్లాపూర్ సర్పంచ్ పులిందర్, బీఆర్ఎస్ నాయకుడు జంగయ్య, కొందరు గ్రామస్తులు సోమవారం రాత్రి పరిగి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. సమావేశానికి అనుమతి ఇవ్వలేమని పోలీసులు తెలిపారు. రైతుల దీక్ష అంశంపై కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో సర్పంచ్‌తో పాటు రైతులు పోలీస్‌స్టేషన్ ఆవరణలో బైఠాయించారు. అనంతరం పోలీసులు గేటు మూసివేయడంతో కాళ్లాపూర్ రైతులు అక్కడికి చేరుకొని ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు సర్పంచ్‌తో పాటు మిగతా వారిని వదిలేయడంతో అంతా సద్దుమణిగింది.