KCR | హైదరాబాద్ : బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కేసీఆర్ పోరాటం వల్లే సమ్మక్క – సారలమ్మ బ్యారేజీ సాధ్యమైందని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వినోద్ కుమార్ స్పష్టం చేశారు. ఈ బ్యారేజీకి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అనుమతులు సాధించినట్టు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడారు.
ఛత్తీస్‌గఢ్‌తో యాభై ఎకరాల ముంపునకు సంబంధించి అంగీకారం కుదిరితే ఏవో గొప్పలు సాధించినట్టు ప్రచారం చేసుకుంటున్నారు. సమ్మక్క బ్యారేజ్‌కు కొత్తగా అనుమతులు సాధించినట్టు డబ్బా కొట్టుకుంటున్నారు. 2001లో కేసీఆర్ చేపట్టిన తెలంగాణ ఉద్యమానికి చంద్రబాబు భయపడి దేవాదుల ప్రాజెక్టుకు శంఖుస్థాపన చేశారు. రూ. 811 కోట్ల వ్యయంతో అప్పట్లో దేవాదులకు జీవో వచ్చారు. 2009లో గానీ ఆ ప్రాజెక్టు పూర్తి కాలేదు. రూ. 15 వేల కోట్ల నుంచి రూ. 20 వేల కోట్లు ఖర్చు పెట్టినా ఆ ప్రాజెక్టు నుంచి సరిగా నీళ్లు తొడలేక పోయారు. ఇన్ టెక్ వెల్ కూడా సరిగా ఏర్పాటు చేయలేదు. 170 రోజులు నీళ్లు తోడాల్సిఉండగా 110 రోజులు కూడా దేవాదులతో నీళ్లు రాలేదు. 37 టీఎంసీల నీళ్లు కూడా కాంగ్రెస్ హయాంలో తోడలేదు. ఫుట్ వాల్ కూడా సరిగా పెట్టకుండా దేవాదుల డిజైన్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిందించకుండా కేసీఆర్ దేవాదుల ప్రాజెక్టును సరిదిద్దారు అని వినోద్ కుమార్ గుర్తు చేశారు.
దేవాదులను పటిష్టం చేసేందుకు ఏడు టీఎంసీల సామర్థ్యంతో సమ్మక్క సారక్క బ్యారేజ్‌ను కేసీఆర్ నిర్మించారు. సమ్మక్క బ్యారేజ్‌కు ఛత్తీస్‌గఢ్ అభ్యంతరాలతో సీడబ్ల్యూసీ అనుమతులు ఇవ్వలేదు. 2023 ఎన్నికల సందర్భంగా ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇక్కడి కాంగ్రెస్ నాయకులు అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి కేసీఆర్‌కు అనుమతులు దక్కకుండా చేశారు. అపుడు ఛత్తీస్‌గఢ్ సంతకం చేసిన ఒప్పంద పత్రాన్ని ఉత్తమ్ తీసుకొచ్చి గొప్పగా చెప్పుకుంటున్నారు. దేవాదుల నుంచి నీళ్లు తెచ్చి నిల్వ చేసుకునేందుకు పది రిజర్వాయర్లు నిర్మించిన ఘనత కేసీఆర్‌దే. పెండింగ్ రిజర్వాయర్లను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయాలి అని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.
50 ఎకరాలపై ఒప్పందం చేసుకుంటేనే కాంగ్రెస్ ఇంత ప్రచారం చేసుకుంటే ఎన్నో ప్రాజెక్టులు ఎంతో కస్టపడి సాధించిన కేసీఆర్ ఎంత ప్రచారం చేసుకోవాలి. తుమ్మిడిహట్టి దగ్గర బ్యారేజీపై మహారాష్ట్రతో చర్చలు జరుపుతామని రేవంత్ రెడ్డి అంటున్నారు. 152 మీటర్లకు తక్కువగా బ్యారేజ్ నిర్మాణానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోకూడదని డిమాండ్ చేస్తున్నాం. దేవాదుల పెండింగ్ పనులు పూర్తి చేసి ప్రాజెక్టు పూర్తి ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాలి. వర్షాకాలం అక్టోబర్‌లో ముగుస్తుంది. మేడిగడ్డకు మరమ్మత్తులు మొదలు పెట్టి అందుబాటులోకి తేవాలి. ఈ సీజన్లో లక్షలాది క్యూసెక్కుల నీళ్లు పారినా మేడిగడ్డ పిల్లర్లు ఒక్క మిల్లి మీటర్ కూడా చెక్కు చెదరలేదు. కేసీఆర్ మీద దుష్ప్రచారం చేయడం మానేసి ప్రాజెక్టుల పూర్తికి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేయాలి అని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.