Palvai Sravanthi | కందుకూరు, ఏప్రిల్ 12 .సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ఏడు అడుగుల బొంద పెట్టడానికి వచ్చాడు తప్ప ఆ పార్టీని అభివృద్ధి చేయడానికి మాత్రం కాదని బీఆర్ఎస్ పార్టీ మహిళా రాష్ట్ర యువ నాయకురాలు పాల్వాయి స్రవంతి విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ వంద స్థానాల్లో గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
కందుకూరు మండల పరిధిలోని లేమూరు గ్రామంలో పాల్వాయి స్రవంతి మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ను బతికించడానికి ఆ పార్టీలో చేరలేదని అన్నారు. తన పబ్బం గడుపుకోవడానికే కాంగ్రెస్ పార్టీలో చేరారని విమర్శించారు. కల్లిబొల్లి మాటలు చెప్పి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాడని అన్నారు. సీఎం అయ్యాక ఇచ్చిన హామీలను తుంగలో తొక్కాడని మండిపడ్డారు. హామీలను నిలబెట్టుకోకుండా బీఆర్ఎస్ పార్టీపై లేనిపోని ఆరోపణలు చేస్తూ, బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నాడని అన్నారు. రేవంత్ రెడ్డి మాటలను ప్రజలు ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఉందని ధీమా వ్యక్తం చేశారు.
ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించే రజతోత్సవ సభను విజయవంతం చేయాలని పాల్వాయి స్రవంతి కోరారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలతో పాటు మండల, జిల్లా సమావేశాలను కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కనివినీ ఎరుగని రీతిలో సభను నిర్వహించి ప్రభుత్వం కళ్లు తెరిపిస్తామని చెప్పారు. ఇక మీద బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేస్తూ చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.