ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో కేటీఆర్‌పై కేసు పెట్టడాన్ని మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ రేసు నిర్వహణలో ఎలాంటి అవినీతి జరగకపోయినా కేటీఆర్‌ను అక్రమంగా అరెస్టు చేయాలని ప్రభుత్వం చూస్తుందని మండిపడ్డారు. మెదక్ బీఆర్ఎస్ క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఫార్ములా ఈ కార్ రేసింగ్‌ను తీసుకొచ్చి హైదరాబాద్ ఇమేజ్ను పెంచారని తెలిపారు.
గత ఏడాది ఫిబ్రవరిలో మొదటిసారి ఫార్ములా ఈ రేస్‌ను హైదరాబాద్‌లో నిర్వహించడం ద్వారా రాష్ట్రానికి రూ.700 కోట్ల ఆదాయం వచ్చిందని పద్మాదేవేందర్ రెడ్డి తెలిపారు. దీనివల్ల హైదరాబాద్‌కు ఎలక్ట్రిక్ వాహనాల సంస్థలు కూడా వచ్చాయని పేర్కొన్నారు. గ్రీన్ కో సంస్థ, కొంతమంది వ్యక్తులకు ఫార్ములా ఈ కార్ రేసింగ్ కోసం గత ప్రభుత్వం సహకరించిందని చెప్పారు. స్వయంప్రతిపత్తిగల హెచ్ఎండీఏ ద్వారా గ్రీన్ కో సంస్థ వారికి బ్యాంకు ద్వారా డబ్బులు పంపించారని తెలిపారు. ఒక్క పైసా కూడా పక్కదారి పట్టలేదని అన్నారు.
ఫార్ములా ఈ కార్ రేసింగ్ తర్వాత ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలు హైదరాబాద్‌కు రావడం వల్ల పెట్టుబడులు పెరిగి లక్షల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందని పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. పర్యావరణాన్ని కూడా పరిరక్షించడం జరిగిందని తెలిపారు. ఎలాంటి అన్యాయానికి తావు లేకుండా ఫార్ములా ఈ కార్ రేసింగ్ నిర్వహించడం వల్ల రాష్ట్ర ప్రతిష్ట పెరిగిందని అన్నారు. అధికార పార్టీకి ధైర్యం ఉంటే అసెంబ్లీలో ఫార్ములా ఈ కార్ రేసింగ్‌పై చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు.
వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చిన ఫార్ములా ఈ రేసుకు సీఎం రేవంత్ రెడ్డి మొదట ఆమోదం తెలిపి.. ఆ తర్వాత దాన్ని రద్దు చేశారని పద్మా దేవేందర్ రెడ్డి విమర్శించారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్‌ను కేటీఆర్ తీసుకొచ్చారని కుట్రపూరితంగా దాన్ని రద్దు చేశారని ఆమె ఆరోపించారు. కేసీఆర్ చరిత్రను రూపు మాపడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి పాలన సాగుతోందని విమర్శించారు. హైడ్రాను తీసుకొచ్చి నిరుపేదల ఇండ్లు కూల్చి హైదరాబాద్ నగరానికి పెట్టుబడులు రాకుండా చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు. మంత్రులంతా దావోస్ పోయినప్పుడు హైదరాబాద్ ఇమేజ్ను పెంచుతామని చెప్పి.. ఇప్పుడు ఫార్ములా ఈ కార్ రేసింగ్‌ను రద్దు చేయడమంటే హైదరాబాద్ అభివృద్ధికి అడ్డుపడటమే అని విమర్శించారు.