హైదరాబాద్, జూలై 16(నమస్తే తెలంగాణ) : మహబూబ్‌నగర్ జిల్లాలోని అమరరాజా గిగా కారిడార్‌లో ప్రతిష్ఠాత్మక కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్ ప్రారంభమైన సందర్భంగా బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తంచేశారు. ఇది గత బీఆర్ఎస్ ప్రభుత్వ కృషికి దకిన ఫలితమని గురువారం ఎక్స్ వేదికగా స్పందించారు.
ఎనర్జీ స్టోరేజ్ రంగంలో తెలంగాణ సాధించిన అతిపెద్ద పెట్టుబడుల్లో ఇది ఒకటని ఆయన గుర్తుచేశారు. రాష్ట్ర పారిశ్రామిక ప్రగతిలో కీలక ఘట్టం ఆవిష్కృతమైందని, తెలంగాణను అధునాతన ఎనర్జీ స్టోరేజ్ తయారీ హబ్‌గా మార్చాలనే లక్ష్యంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలకు ఇది ఒక బలమైన నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
బ్యాటరీ పరిశోధన ఆర్ అండ్ డీ, వాణిజ్య తయారీకి మధ్య ఈ ప్లాంట్ ఒక బలమైన వారధిగా పనిచేస్తుందని, వచ్చే ఏడాది ప్రారంభం కానున్న గిగా ఫ్యాక్టరీకి ఇది పునాది అని కేటీఆర్ అభివర్ణించారు. కాగా, ఈ గిగా కారిడార్ రాకతో తెలంగాణ దేశంలోనే అడ్వాన్స్డ్ ఎనర్జీ స్టోరేజ్ తయారీకి ప్రధాన కేంద్రంగా మారుతోందని తెలిపారు. ఇది కేవలం పారిశ్రామిక వృద్ధిని మాత్రమే కాకుండా, రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలను పెంపొందించడంలో, దేశవ్యాప్తంగా గ్రీన్ ఎనర్జీ విప్లవంలో కీలకం కానున్నదని చెప్పారు.