కేబినెట్ సమావేశం నేపథ్యంలో 19వేల పోలీస్ ఉద్యోగాలతో నోటిఫికేషన్ విడుదల చేయాలన్న డిమాండ్‌తో దిల్‌సుఖ్‌నగర్‌లో గురువారం శాంతియుత ర్యాలీకి యత్నించిన నిరుద్యోగులపై పోలీసులు జులుం ప్రదర్శించారు. అమానుషంగా లాఠీచార్జి చేయడమే కాకుండా.. దౌర్జన్యం చేసి.. ఈడ్చుకుంటూ.. తీసుకెళ్లి.. వాహనాల్లో పడేశారు. అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. లాఠీచార్జి చేయడంతో నిరుద్యోగ జేఏసీ నేత, తెలంగాణ బీఈడీ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూక్యా కుమార్, నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర నేత ఇంద్రానాయక్లకు గాయాలయ్యాయి. నిరుద్యోగులపై పోలీసుల దమనకాండను ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. నాయకులను పరామర్శించారు. ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మానుకోవాలని, నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
– ఎల్బీనగర్, జూలై 16

ఎల్బీనగర్, జూలై 16: పోలీస్ ఉద్యోగాల కోసం శాంతియుత ర్యాలీ చేస్తున్న నిరుద్యోగ అభ్యర్థులపై పోలీసులు జులూం ప్రదర్శించారు. పోలీస్ పోస్టుల కోసం రోడ్డెక్కిన నిరుద్యోగులపై అమానుషంగా లాఠీచార్జ్ చేసి చెదరగొట్టి ఈడ్చీ పారేశారు. నిరుద్యోగ జేఏసీ నాయకులను పిడిగుద్దులతో పాటు లాఠీలకు పనిచెప్పి..అనంతరం అరెస్టులు చేసి నాగోలు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీస్ విభాగంలో 19వేల పోస్టులు ఖాళీగా ఉండగా, కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 5వేలు, 7 వేలు పోస్టులు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పడం పట్ల నిరుద్యోగులు వ్యతిరేకిస్తున్నారు.
కేబినెట్ సమావేశం ఉన్నందున తమకు 19 వేల పోలీస్ ఉద్యోగాలతో నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్‌తో శాంతియుత ర్యాలీతో ప్రెస్‌మీట్‌తో ప్రభుత్వం దృష్టికి తమ సమస్యను తేవాలన్న లక్ష్యంతో చేపట్టిన కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. దిల్సుఖ్నగర్ సాయిబాబా దేవాలయం వీధి వరకు శాంతియుతంగా ప్లకార్డులతో ర్యాలీ చేసేందుకు యత్నించిన నిరుద్యోగ జేఏసీ నాయకులు, నిరుద్యోగులపై పోలీసులు లాఠీచార్జ్ చేసి నిర్బంధించారు. నిరుద్యోగ జేఏసీ నాయకుడు, తెలంగాణ బీఈడీ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూక్య కుమార్, నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర నాయకుడు ఇంద్రానాయక్లపై పోలీసులు లాఠీలు జూళిపించడంతో వారికి గాయాలయ్యాయి.
అదేరీతిలో పలువురు నిరుద్యోగులను పోలీసులు ఈడ్చుకుంటూ.. తీసుకుని వెళ్లి వాహనాల్లో పడేసి అరెస్టు చేసి నాగోలు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఇంద్రా నాయక్, భూక్య కుమార్‌లు మాట్లాడుతూ పోలీస్ ఉద్యోగాల కోసం కేబినెట్ సమావేశంలో నిరుద్యోగుల కోసం మాట్లాడతారనే ఉద్దేశంతో శాంతి యుతంగా ర్యాలీ, ప్రెస్‌మీట్ పెట్టేందుకు ప్రయత్నించిన తమను నిర్బంధించడంతో పాటు లాఠీచార్జ్ చేసి గాయపరిచారని ఆరోపించారు.
పోలీసులు కావాల్సిన యువతపై పోలీసులే లాఠీలు ఎత్తడం ఎంతవరకు సమంజమని వారు ప్రశ్నించారు. ప్రజా ప్రభుత్వం అని చెప్పుకొనే కాంగ్రెస్ నిరుద్యోగ యువత నోరు నొక్కేందుకు, హక్కులను కాలరాసేందుకు యత్నిస్తోందని విమర్శించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా నష్టం చేయడంతో పాటు అండగా నిలిచిన పాపానికి డౌర్జన్యం చేస్తూ లాఠీచార్జ్ పేరుతో దాడులకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగ జేఏసీ నాయకులు ఇంద్రానాయక్, భూక్య కుమార్, ఆకాష్, శంకర్, ప్రవీణ్, సోమేష్ జాదవ్, చెర్రి ప్రవీణ్, శింభు, నవీన్ పట్నాయక్, నవీన్ గౌడ్, రవీందర్ సింధూరెడ్డి , ప్రత్యుష తదితరులు పాల్గొన్నారు.

పరామర్శించిన ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి
దిల్‌సుఖ్‌నగర్‌లో పోలీస్ ఉద్యోగాల కోసం నిరసన వ్యక్తం చేసిన నిరుద్యోగ జేఏసీ నాయకులను అరెస్టు చేసి నాగోలు పోలీస్‌స్టేషన్‌కు తరలించిన విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని నిరుద్యోగ నాయకులను పరామర్శించారు. ఈ సందర్భంగా లాఠీచార్జ్ లో గాయాలకు గురైన భూక్య కుమార్, ఇంద్ర నాయక్‌లతో పాటు ఇతర నిరుద్యోగ జేఏసీ నాయకులను పరామర్శించి పోలీసులతో మాట్లాడి వారిని విడిపించారు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి వెంట ప్రసన్న హరికృష్ణ, కిరణ్ పాల్గొన్నారు.
తీవ్రంగా ఖండిస్తున్నాం..
శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న నిరుద్యోగులపై లాఠీచార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నిరుద్యోగ యువత ఉద్యమాలను అణచివేసే ప్రయత్నాలను మానుకుని నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలి. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలి.
ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి