కాసిపేట : మంచిర్యాల జిల్లా కాసిపేట( Kasipeta) మండలంలోని దేవాపూర్ రాంపూర్ చెందిన బీఆర్ఎస్ (BRS ) నాయకుడు, ఆదివాసీ ఉద్యమ నేత సిడం శంకర్ (38),కుమారుడు సాగర్(12) శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road Accident ) మృతి చెందారు.
సిడం శంకర్ తన భార్య సుమిత్ర, ఇద్దరు కుమారులు సాగర్, సంతోష్ లతో కలిసి బైక్ పై దండేపల్లి మండలానికి వెళ్లి తిరిగి వస్తుండగా లక్షెట్టిపేట ఇటిక్యాల వద్ద బైక్ ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పెద్ద కుమారుడు సాగర్ అక్కడికక్కడే మృతి చెందగా శంకర్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమద్యలో మృతి చెందాడు. భార్య సుమిత్ర, చిన్న కుమారుడు సంతోష్‌కు తీవ్రగాయాలు కావడంతో కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు.
సిడం శంకర్ దేవాపూర్ సిమెంట్ కంపెనీలో లోడింగ్ కార్మికుడిగా విధులు నిర్వహిస్తు అనేక ఆదివాసీ ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించి హక్కుల కోసం పోరాడాడు. తుడుందెబ్బ ఉపాధ్యక్షుడిగా సేవలు అందిస్తున్నాడు. కనీస డ్యూటీలు ఇవ్వాలని శంకర్ ఆందోళనతోనే ప్రస్తుతం కంపెనీలో లోడింగ్ కార్మికులకు కనీస 21 మాస్టర్ల డ్యూటీ విధానం అమలు అవుతుంది. బీఆర్ఎస్ పార్టీలోను కీలక పాత్ర పోషించారు.
సిడం శంకర్ మృతి వార్త తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మంచిర్యాల ఆసుపత్రిలో ఉన్న మృతదేహాలను సందర్శించారు. సిడం శంకర్ హఠాత్మరణం తీవ్రంగా కలిచివేసిందని పేర్కొన్నారు. ఆయన మృతి ఆదివాసీ సమాజానికి, బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. గ్రామంలో నిర్వహించిన అంతమయాత్రకు భారీగా తరలివచ్చి కన్నీటి వీడ్కోలు పలికారు.