ములుగు, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ నాయకుడిపై కాంగ్రెస్ నాయకులు హత్యాయత్నం చేసిన ఘటన ములుగు జిల్లా తాడ్వాయి మండలం కొండపర్తి స్టేజీ వద్ద బుధవారం జరిగింది. బాధితుడు చందా చక్రపాణితోపాటు బీఆర్ఎస్ నాయకులు గురువారం ములుగులో ఎస్పీ సుధీర్రామ్నాథ్కేకన్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా చక్రపాణి మాట్లాడుతూ.. మల్లంపల్లికి చెందిన తాను గతంలో ఆత్మ కమిటీ చైర్మన్‌గా పనిచేశానని తెలిపారు. బుధవారం వాజేడు మండలం టేకులగూడెం ఇసుక క్వారీ సభ్యులు ఫోన్ చేసి పిలువగా.. ఏటూరునాగారం ఐటీడీఏ కార్యాలయానికి వెళ్లి తనకు రా వాల్సిన చెక్కులను తీసుకున్నానని వివరించారు.
వాజేడులో కాకతీయ బ్యాంకులో చెక్కులను విడిపించుకునేందుకు వెళ్తుండగా హైదరాబాద్‌కు చెందిన అంబర్‌పేట రాఘవేందర్రావు, కొండగట్టుకు చెందిన సబ్ కాంట్రాక్టర్లు విక్రమ్‌రెడ్డి, ప్రవీణ్‌రెడ్డి తనను వెంబడించి చెక్కులు ఆపమని బ్యాంకు మేనేజర్‌కు చెప్పారని వివరించారు. అదే సమయంలో కాంగ్రెస్ ములుగు జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ మేనేజర్‌కు ఫోన్ చేసి చెక్కులు ఆపమని చెప్పగా.. ఆయన ఆపడానికి వీలు లేదని చెప్పాడని తెలిపారు. బ్యాంకులో పని ముగించుకొని నార్లాపూర్ మాజీ సర్పంచ్ దేవానాయక్తో కలిసి కారులో ములుగు వైపు వస్తుండగా రాఘవేందర్రావు, విక్రమ్‌రెడ్డి, ప్రవీణ్‌రెడ్డితోపాటు కాంగ్రెస్ నాయకుడు లచ్చుపటేల్ మరో 15 మంది కలిసి మూడు కార్లలో వెంబడిస్తూ జలగలంచ వాగు వద్ద తన కారును ఆపి దాడి చేశారని చెప్పాడు. తనపై హత్యాయత్నం చేసిన సదరు వ్యక్తులపై చర్యలు తీసుకొని తనకు రక్షణ కల్పించాలని ఎస్పీని కోరినట్టు వెల్లడించారు.