నల్లగొండ ప్రతినిధి, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ)/నల్లగొండ సిటీ : రైతాంగానికి 24 గంటల విద్యుత్తు ఇవ్వడం చేతకాకపోతే సీఎం రేవంత్‌రెడ్డి రైతులకు క్షమాపణ చెప్పి, వెంటనే పదవి నుంచి తప్పుకోవాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య డిమాండ్ చేశారు. నకిరేకల్ నియోజకవర్గంలో అప్రకటిత కరెంటులతో పంటలు ఎండుతున్నాయని, లోవోల్టేజీతో మోటర్లు కాలిపోతున్నాయంటూ కొన్ని రోజులుగా రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. రైతుల పక్షాన స్థానిక అధికారులతో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పలుమార్లు మాట్లాడినా ఫలితం లేకపోయింది.
దీంతో గురువారం నియోజకవర్గ రైతులతో కలిసి మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కాలిన మోటర్లను మోటర్ సైకిళ్లపై వేసుకుని, ఎండిన వరి నారును తీసుకొచ్చి నల్లగొండలోని ఎస్ఈ కార్యాలయాన్ని ముట్టడించారు. తక్షణమే అప్రకటిత కరెంటు కోతలను ఎత్తివేయాలని, లోవోల్టేజీ సమస్యను పరిష్కరించాలని, కరెంటు కోతలతో పంటలు ఎండిపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సుమారు రెండు గంటలపాటు ఎండను సైతం లెక్కచేయకుండా రైతులు ఆందోళనలో పాల్గొన్నారు. ట్రాన్స్‌కో ఎస్ఈకి సమస్యలపై వినతిపత్రం అందజేశారు. విద్యుత్తు సరఫరాను మెరుగుపరచకపోతే కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని చిరుమర్తి హెచ్చరించారు.