రాజాపేట, ఆగస్టు 20: వానకాలం వర్షాలపై రైతులు పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి. బోర్లను నమ్ముకుని వరి సాగు చేసిన రైతుకు చివరకు కన్నీళ్లే మిగిలాయి. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం బొందుగుల గ్రామానికి చెందిన బాల్ద నర్సయ్య తనకున్న మూడు ఎకరాల్లో రెండు బోర్లపై ఆధారపడి వరి సాగుచేశాడు. ఇందుకోసం రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టాడు.
వర్షాలు సకాలంలో కురువకపోవడంతో భూగర్భ జలాలు పడిపోవడంతో రెండు బోర్లు పూర్తిగా ఎండిపోయాయి. బోర్లలో నీరు లేకపోవడంతో వరికి నీరు అందించలేకపోయాడు. కండ్ల ముందే పచ్చగా ఉండాల్సిన పైరు క్రమంగా ఎండిపోయి, చివరకు పూర్తిగా దెబ్బతింది. చేసేదేమీ లేక ఎండిన వరి చేనును పశువులకు మేతగా వదిలేసి కన్నీటిపర్యంతమయ్యాడు.