హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా రాయదుర్గ్ పన్మక్తాలో వక్ఫ్ భూముల వేలాన్ని వెంటనే నిలిపేయాలని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగలేఖ రాశారు. పన్మక్తాలోని సర్వే నంబర్ 83/1లో 10.63 ఎకరాల హెరిటేజ్ భూమిని ఈ నెల 17, 21 తేదీల్లో టీజీఐఐసీ ద్వారా వేలం వేయడాన్ని ఖండిస్తున్నామని తేల్చిచెప్పారు.
కొనుగోలు చేసిన వారికి న్యాయపరమైన చిక్కులు తప్పవని హెచ్చరించారు. ‘2020లో ఇవే భూములపై రక్షణ కోరుతూ కోర్టు మెట్లెక్కిన రేవంత్‌రెడ్డి.. సీఎం అయ్యాక థర్డ్ పార్టీ హక్కులు సృష్టించేలా వేలానికి ఏవిధంగా అనుమతిస్తున్నారు? అసలు నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రివా? లేకుంటే రియల్ ఎస్టేట్ ఏజెంట్‌వా?’ అంటూ ప్రశ్నలవర్షం కురిపించారు. పన్మక్తలోని భూములు జీవోఎంఎస్ నంబర్ 4 ద్వారా సర్వే నంబర్ 83ని హెరిటేజ్ సైట్‌గా గుర్తించినట్టు రికార్డులు స్పష్టంచేస్తున్నాయని లేఖలో గుర్తుచేశారు. మీ అనుయాయులకు మేలు చేసేందుకే ఈ భూములను వేలం వేస్తున్నారా? అని నిలదీశారు.
ఎక్కడ భూములు కనిపిస్తే అక్కడ అమ్మకానికి పెట్టడమే ఈ సర్కార్ విధానామా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భూములు కాపాడాలని కోర్టుకు వెళ్లిన రేవంత్.. అధికారంలోకి రాగానే అడ్డగోలుగా అమ్మేందుకు కుట్రలు చేయడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. కంచ గచ్చిబౌలి, లగచర్ల, మనూ, రాయదుర్గ్ ఇలా కనిపించిన చోటల్లా అమ్మకానికి తెరలేపడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు.
గతంలోనే 83/1 సర్వే నంబర్లో 6.2 ఎకరాలు వేలానికి ప్రయత్నిస్తే ఎస్బీఐ కోర్టుకు వెళ్లిందని హరీశ్‌రావు గుర్తుచేశారు. దీంతో కోర్టు అక్షింతలు వేసినా, మళ్లీ అదే సర్వే నంబర్లో 10. 63 ఎకరాలను వేలం వేయడం వెనుక మతలబు ఏందని ప్రశ్నించారు. సదరు భూమిపై అనేక వివాదాలు కోర్టు పరిధిలో ఉన్నాయని స్పష్టంచేశారు. ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు వేలం వేసేందుకు ప్రభుత్వం ఎందుకు తొందరపడుతున్నదని ప్రశ్నించారు. రూ. 2వేల కోట్ల విలువైన భూములను అమ్మే హక్కు ప్రభుత్వానికి ఎవరిచ్చారని నిలదీశారు.
అధికారంలోకి వస్తే ఇంచు ప్రభుత్వ భూమి కూడా విక్రయించబోమని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటలకు విలువలేదా? అని హరీశ్‌రా వు ప్రశ్నించారు. సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వ ఆస్తిని పరిరక్షించడం, కొత్తగా థర్డ్ పార్టీ ఇంట్రె స్ట్ సృష్టించకుండా చూడాల్సిన అవసరాన్ని స్పష్టం చేసిందని గుర్తుచేశారు. ఇలాంటి పరిస్థితుల్లో వివాదంలో ఉన్న భూమిని వేలం వేసి కొత్త హక్కులు సృష్టించడం ఏ విధమైన పరిపాలనా బాధ్యత? అని నిలదీశారు. రాయదుర్గ్ పన్మక్తలోని భూముల రెవెన్యూ, సర్వే, వక్ఫ్ రికార్డులన్నింటినీ బయటకు తీసి సమగ్రంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.