సంగారెడ్డి, ఫిబ్రవరి 17(నమస్తే తెలంగాణ) : సంగారెడ్డి జిల్లాలో ఐదు మున్సిపాలిటీలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. జిల్లాలో మొత్తం 11 మున్సిపాలిటీలకు ఉండగా, ఐదింటిని బీఆర్ఎస్ దక్కించుకుంది. కోరం లేకపోవడంతో వాయిదా పడిన ఇంద్రేశం, జహీరాబాద్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు మంగళవారం జరిగాయి. ఇంద్రేశం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ మెజార్టీ కౌన్సిలర్లు ఉండటంతో చైర్మన్,వైస్ చైర్మన్ పదవులు బీఆర్ఎస్కు దక్కాయి. బీఆర్ఎస్కు చెందిన ప్రమీల చైర్‌పర్సన్‌గా, హరీశ్వర్‌రెడ్డి వైస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఇంద్రేశం మున్సిపల్ చైర్మన్ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వు అయ్యింది. దీంతో ఇక్కడ ఎస్సీ సామాజికవర్గానికి చెందిన కుషంగాల ప్రమీలను బీఆర్ఎస్ చైర్‌పర్సన్‌గా ఎంపిక చేసింది. వైస్ చైర్మన్‌గా హరీశ్వర్‌రెడ్డిని ఎంపిక చేసింది. ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలోని రామేశ్వరంబండ వార్డు కార్యాలయంలో మంగళవారం మొదట కౌన్సిలర్ల ప్రమాణస్వీకారం జరిగింది. ఆ తర్వాత చైర్మన్,వైస్ చైర్మన్ ఎన్నిక చేపట్టారు. చైర్పర్సన్ ప్రమీల, వైస్ చైర్మన్ హరీశ్వర్‌రెడ్డి ప్రమాణస్వీకారం అనంతరం ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డిని కలిశారు. మహిపాల్‌రెడ్డి చైర్మన్,వైస్ చైర్మన్లతోపాటు బీఆర్ఎస్ కౌన్సిలర్లను సన్మానించారు.
జహీరాబాద్ మున్సిపాలిటీలో మెజార్టీ కౌన్సిలర్లు స్థానాలు బీఆర్ఎస్ గెలిచినప్పటికీ, కాంగ్రెస్ ఒక్క ఎక్స్అఫీషియో ఓటుతో చైర్మన్ పీఠాన్ని తన ఖాతాలో వేసుకుంది. జహీరాబాద్ మున్సిపాలిటీలో ఉదయం చైర్మన్,వైస్ చైర్మన్ ఎన్నిక జరిగింది. జహీరాబాద్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ నుంచి 15 మంది కౌన్సిలర్లు ఎన్నికయ్యారు. బీఆర్ఎస్కు బీజేపీకి చెందిన ముగ్గురు కౌన్సిలర్లు మద్దతుగా నిలిచారు. ఎమ్మెల్యే మాణిక్‌రావు ఎక్స్ అఫీషియో ఓటు ఉండటంతో బీఆర్ఎస్ సభ్యుల సంఖ్య 19కి చేరుకుంది. కాంగ్రెస్ నుంచి 14 మంది కౌన్సిలర్లు గెలువగా, ముగ్గురు ఎంఐఎం, ముగ్గురు స్వతంత్ర కౌన్సిలర్లు కాంగ్రెస్ మద్దతు ఇవ్వడంతో కాంగ్రెస్ మద్దతుదారుల సంఖ్య 19కి చేరుకుంది. ఎంపీ సురేశ్ షెట్కార్ ఎక్స్అఫీషియో ఉండటంతో కాంగ్రెస్‌కు కలిసి వచ్చింది. కాంగ్రెస్‌కు ఒక ఓటు అదనంగా ఉండటంతో చైర్మన్ పదవి దక్కించుకుంది. కాంగ్రెస్‌కు చెందిన యూనిస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఇండిపెండెంట్ కౌన్సిలర్ శిరీష్ వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు.
జహీరాబాద్ మున్సిపల్ చైర్మన్,వైస్ చైర్మన్ ఎన్నికలను రద్దు చేసి తిరిగి ఎన్నికలు నిర్వహించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాణిక్‌రావు, బీఆర్ఎస్ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. చైర్మన్ ఎన్నిక సందర్భంగా నిబంధనల మేరకు అక్షరమాల క్రమంలో బీఆర్ఎస్ ప్రతిపాదిత చైర్మన్ అభ్యర్థి పేరు మొదట పిలవాల్సి ఉండగా, కాంగ్రెస్ ప్రతిపాదించిన చైర్మన్ అభ్యర్థి పేరు మొదట పిలిచారని ఎమ్మెల్యే ఆరోపించారు. దీంతో చైర్మన్ ఎన్నికకు అవసరమైన మద్దతు ఉన్నప్పటికీ, బీఆర్ఎస్ చైర్పర్సన్ అభ్యర్థి పదవికి దూరం కావాల్సి వచ్చిందన్నారు. అధికారుల నిబంధనలు పాటించకపోవడం, అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించడంతోనే జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జహీరాబాద్ మున్సిపల్ చైర్మన్,వైస్ చైర్మన్ ఎన్నిక రద్దు చేసి తిరిగి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇదే విషయమై బీఆర్ఎస్ 27వ వార్డు కౌన్సిలర్ కాట స్రవంతి ఎన్నికల అధికారులకు లిఖిత పూర్వకంగా ఫి ర్యాదు చేశారు. అంతకుముందు బీఆర్ఎస్ నాయకులు చైర్మన్ ఎన్నిక రద్దు చేయాలంటూ మున్సిపల్ ఎదుట నిరసన చేపట్టారు.