Godavarikhani | గోదావరిఖని : రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ నియంత పాలనకు ప్రజా కంటక పాలనకు నిదర్శనమని, రామగుండం నియోజకవర్గంలో ప్రజలను వ్యాపారులను బెదిరిస్తూ అక్రమంగా అర్ధరాత్రి కూల్చివేతలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాల్ల హరీష్ రెడ్డి మండిపడ్డారు. మంథనిలో సోమవారం జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి అండదండలతో మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో మా పాలనను ఎదిరించినా, మేము చేసే పనులను ప్రశ్నించినా అడ్డంగా నరుకుతామని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గూండా లాగా మాట్లాడడం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధిగా కాకుండా చట్టాన్ని ఉల్లంఘించి ప్రవర్తించడం నేరమని ఆయన అన్నారు. ఎమ్మెల్యే పై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
ఈ మేరకు మంగళవారం గోదావరిఖని వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళుతుండగా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఫిర్యాదు తీసుకునేందుకు కూడా స్థానిక పోలీసులు భయభ్రాంతులకు గురవడం శోచనీయమని అన్నారు. రామగుండంలో ప్రజా పాలన గాడి తప్పిందని, ఓటేసినందుకు ప్రజలను నరకడమా.. ప్రశ్నించే ప్రతిపక్ష గొంతులను నరకడమా..? కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాలని హరీష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఒకపక్క రామగుండంలో చీకటి అధికారులను పంపించి ఇల్లు కూలుస్తామని బెదిరిస్తున్నారని గుర్తుతెలియని వ్యక్తుల ఫోన్లో ద్వారా ఎమ్మెల్యే మాటకు ఎదురు చెబితే చంపుతామని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.
రామగుండం నియోజకవర్గం ఉద్యమాలకు పురిటి గడ్డ అని ప్రశ్నించే తత్వం మొదలైతే రాజ్ ఠాకూర్ తట్టుకోలేడని గతంలో ఏం జరిగిందో ఎమ్మెల్యేకు భజన చేసే కాంగ్రెస్ నాయకులు తెలుసుకోవాలని అన్నారు. ప్రజలే కదా అని చిన్న చూపు చూస్తే ప్రజా ఉద్యమాలు నడిపిన గడ్డ గోదావరిఖని అడ్డా అనేది గుర్తుతెరగాలని ప్రజలకు సేవ చేసే ప్రతినిధిగా మాట్లాడాలి తప్ప పదవి ఉంది అని అహంకారంతో గూండా గిరి లా మాట్లాడితే.. ప్రజలు సహించరని అవకాశం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి జహిద్ పాషా, పోలాడి శ్రీనివాసరావు మాజీ కార్పొరేటర్ ఐత శివకుమార్, బొబ్బిలి సతీష్, యువజన విభాగ అధికార ప్రతినిధి బూరుగు వంశీకృష్ణ, నడిపల్లి సాయి, రోడ్డ సంపత్, రాజకుమార్, సురేందర్ సాయిచరణ్ , చిట్టవేణి వేణు, సార్ల ఉదయ్, నరేష్, కొండా సురేష్, పోయిల రవి, అనిల్, యుగంధర్, సదయ్య తదితరులు పాల్గొన్నారు.