హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ సహా దళితులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని తెలంగాణ శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి డిమాండ్ చేశారు. దళిత అభ్యున్నతికి గత కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తే, రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఫేక్ ప్రచారాలు, డైవర్షన్ రాజకీయాలతో కాలం వెళ్లదీస్తున్నదని ఆరోపించారు. అంబేదర్ ఆశయ సాధనకు కేసీఆర్ ప్రాధాన్యమిచ్చారని, అందుకే హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతోపాటు నూతన సచివాలయానికి అంబేదర్ పేరు పెట్టారని కొనియాడారు. 70 ఏండ్ల కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్ల మగ్గిపోయిన దళిత కుటుంబాలకు రూ.10 లక్షలు నేరుగా అందించే విప్లవాత్మక దళితబంధును కేసీఆర్ ప్రవేశపెట్టారని గుర్తుచేశారు.
ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ఇచ్చిన హామీలను విస్మరించిందని విమర్శించారు. అంబేదర్ అభయహస్తం కింద రూ.12 లక్షల సాయం చేస్తామని గ్యారంటీ కార్డులిచ్చి మోసం చేయడమే కాకుండా, పాత దళితబంధును పకనబెట్టారని మండిపడ్డారు. పదో తరగతి నుంచి పీహెచ్డీ వరకు విద్యార్థులకు రూ.10వేల నుంచి రూ.5 లక్షల వరకు ఇస్తామన్న హామీలను గాలికొదిలేశారన్నారు. అసెంబ్లీలో కార్యకర్తల ఫేక్ ఐడీలతో తయారుచేసిన కంటెంట్‌ను ప్రదర్శిస్తూ సీఎం రేవంత్‌రెడ్డి దిగజారుడుతనానికి పరాకాష్టగా నిలిచారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రతిపక్షాల ప్రశ్నల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే సీఎం రేవంత్ రాజీనామా రాగం అందుకున్నారని ఆరోపించారు. కేసీఆర్ చావును కోరుకునేలా వ్యాఖ్యలు చేయించడం, నివాసంపై దాడులను ప్రోత్సహించడం కాంగ్రెస్ పాశవిక రాజకీయాలకు నిదర్శనమని స్పష్టంచేశారు.