BRS | కేపీహెచ్‌బీ కాలనీ, ఫిబ్రవరి 18 : కాంగ్రెస్ పార్టీకి షాడో లీడర్‌గా మారవద్దని జీహెచ్ఎంసీ అధికారులకు కూకట్పల్లి నియోజకవర్గ కార్పొరేటర్లు సూచించారు. ఎమ్మెల్యే కృష్ణారావు జన్మదినం సందర్భంగా ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను ముందురోజునే ఎలా తొలగిస్తారని మండిపడ్డారు.
కూకట్పల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను నెలల తరబడి అలాగే ఉంచుతున్నారని.. కేసీఆర్, మాధవరం కృష్ణారావు జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్షీలను ముందే ఎలా తొలగిస్తారని కూకట్పల్లి కార్పొరేటర్లు మండిపడ్డారు. జీహెచ్ఎంసీ అధికారులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తే సహించేది లేదని కాంగ్రెస్ నాయకులను హెచ్చరించారు. జీహెచ్ఎంసీ నిబంధనలు అన్ని పార్టీలకు ఓకే లాగా ఉండాలని.. భవిష్యత్తులో కాంగ్రెస్, బీజేపీలకు చెందిన ఫ్లెక్సీలను కూడా ఇదే తరహాలో తొలగించాలని సూచించారు. లేదంటే బీఆర్ఎస్ పక్షాన పోరాడుతామని హెచ్చరించారు.
రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజా సమస్యలపై పనిచేయడం మానుకొందని.. చిల్లర రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుతుందని కార్పొరేటర్లు విమర్శించారు. పదేండ్ల పాలనలో కేసీఆర్ రాష్ట్రాన్ని ఆదర్శవంతంగా అభివృద్ధి చేశారని… 14 నెలల పాలనలో రేవంత్ రెడ్డి సర్కార్ అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఇకపై ఎక్కడైనా సరే ఏ పార్టీ నేతల ఫ్లెక్సీలు కనిపించినా.. ఇదే తరహాలో అధికారులు స్పందించాలన్నారు. లేదంటే అధికారుల తీరుపై పోరాడతామని హెచ్చరించారు.