కేసీఆర్.. ఏదీ చేసినా సంచలనమే.. ఉద్యమమైనా.. పరిపాలనైనా.. పార్టీ అభ్యర్థుల ప్రకటనైనా. తెగించి కొట్లాడి రాష్ర్టాన్ని సాధించాడు. సంక్షేమం-అభివృద్ధిని జోడెడ్లలా అమలు చేస్తున్నాడు. రెండు పర్యాయాలు దిగ్విజ యంగా పూర్తి చేసి.. హ్యాట్రిక్ సాధించడానికి సమరశంఖం పూరించాడు. రెండోసారి కూడా ఏకబిగిన అభ్యర్థు లను ప్రకటించి ప్రతిపక్షాలకు ముచ్చెమటలు పట్టించాడు. గెలుపు గుర్రాలను ప్రకటించి, విపక్షాల నోరు మూ యించారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆచీతూచీ ప్రకటించారని, ఉమ్మడి జిల్లాలో పది స్థానాలకు పది గెలుస్తారనే చర్చ నడుస్తోంది. మూడు స్థానాలు మార్పు చేసి.. ఏడు సిట్టింగ్‌లకు ఇచ్చి గెలుపు పక్కా చేసుకున్నా రని ప్రజలు చర్చించుకుంటున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటనతో కార్యకర్తలు, నాయకులు జోష్ మీద ఉండగా.. ఇతర పార్టీలకు కొన్నిచోట్ల అభ్యర్థులు కరువై దిక్కుతోచని స్థితిలో పడ్డాయి. కాగా.. అసంతృప్తులను ఎరవేసే పనిలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఉన్నారు. – మంచిర్యాల, ఆగస్టు 22(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మంచిర్యాల, ఆగస్టు 22(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో పది చోట్ల బీఆర్ఎస్ గెలుపు ఖాయంగా కనిపిస్తున్నది. సిట్టింగులకు టికెట్ ఇవ్వడం, మూడు చోట్ల మార్పు చేయడం పక్కాగా జరిగిందని, ఎంపిక చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులంతా గెలిచేవారేనని జోరుగా చర్చ నడుస్తున్నది. బీఆర్ఎస్ టికెట్ ఎవరికి ఇస్తారనే విషయంలో స్పష్టత రావడంతో క్షేత్రస్థాయిలో బలం పెరిగింది. దీంతో ప్రతిపక్ష పార్టీలకు కోలుకోలేని షాక్ తగిలింది. బీఆర్ఎస్ దూకుడు పెంచడంతో ఆ పార్టీలు అయోమయం లో పడిపోయాయి. ప్రత్యర్థి ఎవరో తేలకముందే బీఆర్ఎస్ కదనోత్సాహంతో ముందడుగు వేయడంతో ఆ పార్టీల్లో ఉన్న కొద్దిపాటి నాయకులకు మింగుడు పడడం లేదు. కొన్ని స్థానాల్లోనైతే కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులే దొరకని పరిస్థితి. మరికొన్ని స్థానాల్లో గ్రూపు రాజకీయాలతో ఎటూ తేల్చుకోలేని దుస్థితి. దీంతో బీఆర్ఎస్ టికెట్ ఆశించి బంగపడిన నాయకులను ఎరవేసే పనిలో ఈ రెండు పార్టీలు లీనమయ్యాయి. ఈ నేపథ్యంలో నియోజకవర్గాలవారీగా పార్టీల పరిస్థితులపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం.
ఆదిలాబాద్‌లో అడ్డేలేదు..
ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్న మరోసారి కచ్చితంగా గెలవనున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలతోపాటు ఆయనకు వ్యక్తిగత ఇమేజ్ ఉంది. ప్రజలకు అందుబాటులో ఉంటూ, సమస్యలు పరిష్కరించడంలో ముందుం టారు. జిల్లా అభివృద్ధిలో రామన్న పాత్ర గణనీయమనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. బోథ్ అభ్యర్థి అనిల్‌కుమార్ జాదవ్‌కు నియోజకవర్గం లో మంచిపేరు ఉంది. పార్టీ తరఫున కష్టపడుతున్నారు. పైగా మూడు సార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినా.. ఈసారి గెలిపించుకోవాలని పార్టీ కార్యకర్తలు, నాయకులు భావిస్తున్నారు. దీంతో బోథ్‌లోనూ బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తున్నది. ఇక ఆదిలాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉంది. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సుజాత, డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, సీనియర్ లీడర్ సంజీవ్‌రెడ్డి ఒక వర్గం, కంది శ్రీనివాస్‌రెడ్డి మరో వర్గంగా ఏర్పడి టికెట్ కోసం కొట్టుకుంటున్నారు. మాకు టికెట్ వస్తుందంటే మాకే వస్తుందని ఎవరికీ వారు ప్రచారం చేసుకుంటున్నారు. మరోవైపు బీజేపీలోనూ పాయల్ శంకర్, సుహాసిని రెడ్డి వర్గాలు ఉన్నాయి. రెండు ప్రధాన పార్టీలకు వర్గపోరు కొరకరాని కొయ్యగా మారింది. ఇక బోథ్‌లో కాంగ్రెస్ నుంచి గజేందర్, డాక్టర్ వన్నెల అశోక్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ఎవరికీ వారు టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇక బీజేపీ పార్టీ నుంచి ఇక్కడ అభ్యర్థే లేకుండా పోయారు. వేరే పార్టీల నుంచి ఎవరు పోటీ చేసినా ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి అడ్డే ఉండదనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది.
ఆసిఫాబాద్ కంచుకోట..
ఆసిఫాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ కంచుకోటగా ఉంది. ఇక్కడ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని ప్రజలు చెబుతున్నారు. ఇక్కడ పార్టీ అభ్యర్థి కోవ లక్ష్మికి మంచిపేరు ఉంది. ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించి పరిష్కరిస్తారని, నియోజకవర్గ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటారనే గుర్తింపు ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆసిఫాబాద్ నుంచి కోవ లక్ష్మి గెలుపు నల్లేరుపై నడకగా మారనుంది. ఇక కాగజ్‌నగర్‌లో కోనేను కోనప్ప హవా నడుస్తోంది. కోనప్ప తప్ప వేరే వారు గెలిచే పరిస్థితి లేదు. ఆసిఫాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ నుంచి మర్సకోళ్ల సరస్వతి, గణేశ్రాథోడ్, శ్యాంనాయక్ మూడు వర్గాలు ఉన్నాయి. వీరిలో ఎవరికీ టికెట్ ఇస్తారనే స్పష్టత లేదు. బీజేపీ అభ్యర్థి ఆత్మరామ్‌నాయక్ ఉన్నా ఆయన పెద్దగా ప్రభావం చూపే పరిస్థితి లేదు. కాగజ్‌నగర్‌లో కాంగ్రెస్, బీజేపీల మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పోటీ చేస్తారని గతంలో ప్రకటించినా ఇప్పటికైతే స్పష్టత లేదు. ఒకవేళ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ వచ్చినా గెలిచే పరిస్థితి మాత్రం లేదు. కాంగ్రెస్ పార్టీకి అసలు అభ్యర్థే లేదు. బీజేపీలో పాల్వాయి హరీశ్ ఉన్నా ఆ పార్టీకి నియోజకవర్గంలో ఓటు బ్యాంక్ లేదు.
మంచిర్యాలలో మనదే హవా..
మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావుకు ప్రజల్లో మంచి పేరు ఉంది. సౌమ్యుడని, ఆయన కారణంగా మంచిర్యాల ప్రశాంతంగా ఉందని, మరోసారి ఆయనే గెలవాలని ప్రజలు కోరుకుంటున్నారు. మంచిర్యాల జిల్లా కావడానికి ఆయన విశేష కృషి చేశారని, అభివృద్ధి పనులు బాగా చేస్తున్నారనే గుర్తింపు ఉంది. ఎవరెన్నీ కుట్రలు పన్నినా.. ఆయనకే టికెట్ వచ్చిందని.. కచ్చితంగా గెలుస్తారు కాబట్టే సీఎం కేసీఆర్ మరోసారి అవకాశం ఇచ్చారని జనంలోకి బలంగా వెళ్లింది. చెన్నూర్‌లో ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌కు ఎదురే లేకుండా పోయింది. రాష్ట్రంలో మరే నియోజకవర్గంలో జరగని అభివృద్ధి ఇక్కడ చేసి చూపించారని, మరోసారి గెలిపిస్తే చెన్నూర్‌ను యావత్ దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతారని నియోజకవర్గ ప్రజలు భావిస్తున్నారు. బెల్లంపల్లిలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు మంచిపేరు ఉంది. ఆయన్ని రాజకీయంగా ఎదుర్కొనే సత్తా ఎవరికీ లేదని, ఆయన హయాంలోనే బెల్లంపల్లి బాగుపడిందని ప్రజల్లో ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో బలమైన ఓటు బ్యాంక్ చిన్నయ్యకు ఉంది. దీంతో ఈ మూడు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయంగా మారింది. మంచిర్యాలలో కాంగ్రెస్ నుంచి ప్రేమ్‌సాగర్‌రావు ఉన్నా ఆయనకు కోపం ఎక్కువని, ఎవరినీ లెక్క చేయకుండా ఒంటెద్దు పోకడలు పోతారనే.. ఈయన్నీ గెలిపిస్తే జనాలు ఇబ్బంది పడక తప్పదనే ప్రచారం జరుగుతున్నది. ఇక ఇదే పార్టీ నుంచి బీసీ నాయకుడు నీలకంఠేశ్వర్రావు కూడా టికెట్ వస్తుందనే ధీమాలో ఉన్నారు. బీజేపీ పార్టీ నుంచి వెరబెల్లి రఘునాథరావు పెద్దగా ప్రభావం చూపే పరిస్థితి లేదు. చెన్నూర్‌లో కాంగ్రెస్ నుంచి రామిండ్ల రాధిక, రాజా రమేశ్, నూకల రమేశ్, గోమస శ్రీనివాస్‌తోపాటు మరో ఐదారుగురు ఎవరికీ వారు టికెట్ మాకే అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఒకరిని ఒకరు డామినేట్ చేసేలా పర్యటనలు చేస్తున్నారు. వీరికి తోడు ఈ మధ్యే మూల రాజిరెడ్డి పార్టీలో చేరడంతో ఆయనకే టికెట్ ఇస్తారనే చర్చ నడుస్తున్నది. దీంతో నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పడరాని పాట్లు పడుతున్నది. బీజేపీ నుంచి గడ్డం వివేక్ పోటీ చేస్తారనే ప్రచారం తప్ప.. ఇప్పటివరకు స్పష్టమైన ప్రకటన లేదు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే వస్తారనే చెడ్డపేరు ఉంది. ఇక బెల్లంపల్లిలో కాంగ్రెస్ పార్టీ నుంచి గడ్డం వినోద్‌తోపాటు మరో పది మంది పేర్లు వినిపిస్తున్నాయి. ప్రేమ్‌సాగర్‌రావు, వినోద్, గోమస శ్రీనివాస్ వర్గాలు ఎవరికీ వారు ఎమ్మెల్యే అభ్యర్థి తామంటే తామని ప్రచారం చేసుకుంటున్నారు. ఇక బీజేపీ పార్టీకి ఇక్కడ సరైన అభ్యర్థి లేడు.
అసంతృప్తులపై కన్ను..
కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు లేక కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తెగ కష్టపడుతున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రకటించడంతో తాము వెనుకబడి పోయామనే భావనలో ఆ పార్టీలు ఉన్నాయి. ఇదే సమయంలో బీఆర్ఎస్ పార్టీలో టికెట్ ఆశించి భంగపడిన నాయకులపై గురి పెట్టారు. టికెట్ దక్కని ఎమ్మెల్యే అభ్యర్థులు, సెకండ్ కేడర్ నాయకులకు ఎర వేస్తున్నాయి. సోషల్ మీడియాను ఇందుకు ఆయుధంగా చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ నుంచి చేరికలు అంటూ ఫేక్ ప్రచారం చేస్తూ గందరగోళం క్రియేట్ చేస్తున్నాయి. ఏదేమైనా బీఆర్ఎస్ స్పష్టమైన అభ్యర్థులతో బరిలోకి దిగడం.. ఆ పార్టీలకు అభ్యర్థులు దొరక్కపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సాధ్యమైనంత త్వరగా అభ్యర్థులను ఖరారు చేయకపోతే కొద్దిపాటి ఓట్లు కూడా పదే పరిస్థితి కనిపించడం లేదు.
నిర్మల్‌లో నీళ్లు నములుతున్న ప్రతిపక్షాలు..
నిర్మల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ చాలా బలంగా ఉండగా.. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి అనుకూల వాతావరణం ఉంది. నిర్మల్‌లో ఎన్న డూ లేనంత అభివృద్ధి జరిగిందంటే.. దానికి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కారణమనే అభిప్రాయం ఉంది. నిర్మల్‌ను జిల్లా చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారనే పేరు ఉంది. ఇవన్నీ కూడా ఇంద్రకరణ్‌రెడ్డికి కలిసిరానున్నాయి. అన్ని అనుకూలతల మధ్య ఆయన గెలవడం సులభం కానుంది. ముథోల్‌లో బీఆర్ఎస్ గెలుపు స్పష్టమని చెప్పవచ్చు. ఇక్కడ ముస్లిం ఓట్లన్నీ బీఆర్ఎస్కే గంపగుత్తగా పడనున్నాయి. విఠల్‌రెడ్డి బాగా కష్టపడతారనే పేరు ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీకి మంచి పట్టు ఉంది. ఖానాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కొత్త అభ్యర్థి జాన్సన్ నాయక్ పేరు ప్రకటించగానే కార్యకర్తలు, నాయకుల్లో జోష్ పెరిగింది. కొంత కాలంగా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తు న్న నాయకుడిని గుర్తించి టికెట్ ఇవ్వడంపై హర్షం వ్యక్తం అవుతోంది. దీంతో ఈయన గెలుపు కూడా ఖాయంగా కనిపిస్తున్నది. నిర్మల్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీహరిరావు మొన్నటి వరకు బీఆర్ఎస్లోనే ఉండి పోయారు. ఆయన ప్రభావం అసలు ఎన్నికల్లో ఉండడం సందేహంగా మారింది. బీజేపీ నుంచి మహేశ్వర్‌రెడ్డి ఉన్నా.. ఈయనపై గతంలో ఇంద్రకరణ్‌రెడ్డి చాలా సార్లు గెలుస్తూ వచ్చారు. అదే సెంటిమెంట్ మరోసారి రిపీట్ అవుతుందని ప్రజల్లో చర్చ నడుస్తోంది. ముథోల్‌లో కాంగ్రెస్‌కు నిన్నమొన్న టి వరకు అభ్యర్థి లేరు. మొన్న ఓ డాక్టర్‌ను పార్టీలో చేర్చుకున్నా. ఆయన పేరు కూడా నియోజకవర్గంలో ఎవరికీ తెలియదు. బీజేపీ నుంచి రామారావు పటే ల్, మోహన్‌రావు పటేల్, రమాదేవి ముగ్గురు టికెట్ ఆశిస్తున్నారు. ఎవరికీ వారు నియోజకవర్గంలో తిరుగుతూ ఆ పార్టీ కార్యకర్తలు, జనాలకు వి సుగు తెప్పిస్తున్నారు. ఖానాపూర్‌లో బీజేపీ నుంచి మాజీ ఎంపీ రా థోడ్ రమేశ్, భూక్యా జానుబాయి పోటీ పడుతున్నారు. ఇక్కడ కూడా పార్టీలో వర్గపోరు మైనస్ కానుండగా, కాంగ్రెస్ కు ఇక్కడ బలమైన అభ్యర్థి లేడు.