కుభీర్ : చిన్నారుల ఆరోగ్య భద్రతకు తల్లిపాలు ( Breastfeeding ) పునాదిలాంటివని గొడ్సరా పల్లె దవఖాన ( Palle Hospital ) వైద్యుడు ప్యాట ప్రణయ్ అన్నారు. మండలంలోని చొండి గ్రామంలో అంగన్వాడీ కేంద్రాల( Anganwadi Centres ) ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాల సందర్భంగా శనివారం తల్లిపాల విశిష్టతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంతరం తల్లిపాల ఆవశ్యకతపై గర్భిణిలు, బాలింతలు , కిశోర బాలికలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత అంగన్వాడీ టీచర్లపై ఉందన్నారు.
తల్లిపాలే కాకుండా ముర్రుపాల విషయంలో కూడా తల్లులకు అవగాహన కల్పించాలని సూచించారు. శిశువుల ఆరోగ్య సమతుల్యతలో తల్లిపాలు ఎంతో ప్రాధాన్యమైనవని అన్నారు. అనంతరం గర్భిణీలు, బాలింతలకు ఆరోగ్య పరీక్షలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ సుగుణ, అంగన్వాడీ టీచర్లు సరిత, గంగామణి, ఏఎన్ఎం శోభ, ఆశా కార్యకర్త కవిత, తదితరులున్నారు.