బ్రసిలియా : భారత్ బయోటెక్ కొవిడ్ టీకా కొవాగ్జిన్ అత్యవసర వినియోగ అనుమతిని బ్రెజిల్ రద్దు చేసింది. ఈ మేరకు టీకా అత్యవసరంగా వాడేందుకు అనుమతిని నిషేధిస్తున్నట్లు బ్రెజిల్ జాతీయ ఆరోగ్య నిఘా సంస్థ తెలిపింది. భారత్ బయోటెక్ కంపెనీ కొవాగ్జిన్ టీకా అందించేందుకు ఆ దేశంలోని ‘ప్రిసిసా మెడికమెంటోస్’తో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాన్ని ఇటీవల రద్దు చేసుకున్న చేసుకుంది. టీకా అనుమతులు తీసుకునేందుకు ఆ దేశ ఔషధ నియంత్రణ సంస్థ అయిన ‘అన్విసా’తో కలిసి పని చేస్తామని పేర్కొంది. ఈ క్రమంలోనే బ్రెజిల్ ఈ నిర్ణయం తీసుకున్నది. కొవాగ్జిన్ వ్యాక్సిన్ను అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించడానికి అనుమతి నిలిపివేసే నిర్ణయం బోర్డు సమావేశంలో ఏకగ్రీవంగా తీసుకున్నట్లు బ్రెజిల్ జాతీయ ఆరోగ్య పర్యవేక్షణ సంస్థ అన్విసా ఒక ప్రకటన విడుదల చేసింది. టీకాల కొనుగోలు వ్యవహారం బ్రెజిల్లో వివాదంగా మారిన విషయం తెలిసిందే.