– బాంబును కొరికిన కుక్క మృతి
భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 03 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం రైల్వే స్టేషన్లో నాటు బాంబులు కలకలం రేపాయి. ఓ బాంబును కొరికిన వీధి కుక్క పేలుడు ధాటికి మృతి చెందింది. విషయం తెలిసిన రైల్వే పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాంబులు అక్కడకి ఎలా వచ్చాయో విచారణ చేయగా పక్కనే ఉన్న చెత్త కుప్పలో నాటు బాంబులు ఉన్నట్లు గుర్తించారు. రైల్వే స్టేషన్లో అనుమానాస్పదంగా పడి ఉన్న సంచులను రైల్వే పారిశుధ్య సిబ్బంది చెత్తకుప్పలో పడేశారు. మూడు సంచుల్లో ఐదు బాంబులు ఉండగా, ఒక బాంబు కొరికిన కుక్క మృతి చెందింది. మరో నాలుగు బాంబులను స్వాధీనం చేసుకున్నారు. కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. ఉదయం వెళ్లే రైలులో నాటు బాంబులను తరలించేందుకు ఎవరో ప్రయత్నించి ఉంటారని పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Bhadradri Kothagudem : భద్రాద్రి కొత్తగూడెం రైల్వే స్టేషన్లో నాటు బాంబుల కలకలం