సినిమాల కోసం శరీర రూపురేఖల్ని మార్చుకోవాల్సిన అవసరం లేదని అంటున్నది బాలీవుడ్ బ్యూటీ అయేషా ఖాన్. తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయేషా మాట్లాడింది. కెరీర్ తొలినాళ్లలో తనపై కొందరు నెగెటివ్ కామెంట్లు, బాడీ షేమింగ్ కూడా చేసేవారని వాపోయింది. ఆ సమయంలో ఎన్నో ఇబ్బందులు పడ్డానని చెప్పుకొచ్చింది. సినిమా అవకాశం రావాలంటే.. తన ముక్కును సరిచేయించుకోవాలని ఓ వ్యక్తి సలహా ఇచ్చాడట. “అతని మాటలతో నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే.. నాకు నా ముక్కంటే ఎంతో ఇష్టం. అది చాలా అందంగా ఉంటుందని నా అభిప్రాయం. దానికి సర్జరీ చేయించుకోవాలని చెప్పడానికి అతనెవ్వరు?” అంటూ ఆగ్రహం వ్యక్తంచేసింది. అలాంటి వాళ్లు జీవితంలో ముందుకెళ్లలేరనీ.. పక్కవాళ్ల మీద పడి ఏడుస్తారని విమర్శించింది. ఇలాంటిదే మరో సంఘటన గురించీ వెల్లడించింది.
ఈసారి ఓ పెద్ద డైరెక్టర్ తన దంతాలను మార్చుకోమని చెప్పాడట. “ఒక హర్రర్ సినిమా కోసం ఆడిషన్ ఇస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. కాస్టింగ్ సెషన్‌కి బాలీవుడ్లో పేరుమోసిన దర్శకుడు వచ్చాడు. నేను కూడా ఆయనతో కలిసి పనిచేయడానికి చాలా ఉత్సాహంగా ఎదురుచూశాను. అక్కడే ఆడిషన్ చేశాను. డైరెక్టర్ కూడా మెచ్చుకున్నాడు. కచ్చితంగా నేనే సెలెక్ట్ అవుతానని అందరూ భావించారు. కానీ, అంతలోనే ఓ తిరకాసు పెట్టారు” అంటూ నాటి సంగతులను పంచుకున్నది. అది హర్రర్ సినిమా కాబట్టి.. తన దంతాల వరుసను సరిచేసుకోవాలని అడిగారట. దాంతో తనకు ఇబ్బందిగా అనిపించి.. ఆ సినిమా నుంచి తప్పుకొన్నదట ఆయేషా ఖాన్.
టీవీ సీరియల్స్‌లో జూనియర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టిన ఆయేషా.. తెలుగు సినిమా ‘ముఖచిత్రం’తో వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత ‘ఓం భీమ్ బుష్’, ‘మనమే’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. విశ్వక్సేన్ హీరోగా వచ్చిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’లో ఐటమ్ సాంగ్‌లో కనిపించింది. ఆ తర్వాత బాలీవుడ్ బాటపట్టి.. హిందీ బిగ్‌బాస్-17వ సీజన్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరైంది. ఇటీవలే.. రణ్వీర్ సింగ్, మాధవన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ‘ధురంధర్’ సినిమాలోనూ ప్రత్యేక గీతంలో అలరించింది.‘శరారత్’ పాటలో స్టెప్పులేసింది. కపిల్ శర్మ ప్రధాన పాత్రలో నటించిన ‘కిస్ కిస్కో ప్యార్ కరూన్-2’లోనూ తనదైన నటనతో ఆకట్టుకున్నది.