Bhagyashree : ‘మైనే ప్యార్ కియా’ అంటూ సల్మాన్ ఖాన్‌తో జతకట్టి యువతను తన ప్రేమలో పడేసుకుంది. ఇప్పుడు, సెకండ్ ఇన్నింగ్స్‌లో అందమైన తల్లిపాత్రలతో అన్నితరాల ప్రేక్షకులను అలరిస్తున్నది. ఇన్నాళ్లూ సినిమాలకు దూరంగా ఉండటానికి కారణాలనూ వివరిస్తున్నది వెండితెర సౌభాగ్యం భాగ్యశ్రీ..
నేను ముంబైలో పుట్టిపెరిగాను. మాది రాజవంశం. సొంతూరికి వెళ్తే మమ్మల్ని, మా వేషధారణను వింతగా చూసేవాళ్లు. పూర్తి సంప్రదాయ కుటుంబం మాది. ముగ్గురు అక్కాచెల్లెళ్లలో నేనే పెద్ద. సినిమాల్లోకి రావాలన్న ఆలోచనే లేదు నాకు. చదువులో మాత్రం చాలా చురుగ్గా ఉండేదాన్ని. విదేశాల్లో చదువుకోవాలని కలలు కనేదాన్ని.
పదో తరగతి పరీక్షల తర్వాత.. వేసవి సెలవులను ఎంజాయ్ చేస్తున్న సమయంలో ‘కచ్చీ ధూప్’ అనే టీవీ సీరియల్లో అవకాశం వచ్చింది. అదీ విచిత్రంగానే! ఆ సీరియల్ దర్శకుడు అమోల్ పాలేకర్ మా పక్కింట్లో ఉండేవారు. తెల్లారితే షూటింగ్ అనగా, అందులో నటించాల్సిన అమ్మాయి కనపడకుండా పోయింది. అప్పటికప్పుడు అమ్మానాన్నలతో మాట్లాడి నన్ను తీసుకున్నారు. నేనేమో ససేమిరా అన్నాను. దర్శకుడు చాలాసేపు బతిమాలాడు. దాంతో షూటింగ్‌కు సిద్ధమయ్యాను. అప్పటికి నాకు నటనపై ఏమాత్రం అవగాహన లేదు.
‘కచ్చీ ధూప్’ విజయం సాధించడంతో ‘మైనే ప్యార్ కియా’లో సల్మాన్ ఖాన్ పక్కన నటించే అవకాశం వచ్చింది. ఆ సినిమాకు ఫిలింఫేర్ అవార్డు కూడా దక్కింది. హిందీలోనే కాకుండా కన్నడ, బెంగాలీ, తెలుగు, మరాఠీ, భోజ్‌పురి భాషల్లోనూ నటించాను. ఆ తర్వాత పెండ్లి. కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నా. కంగనా రనౌత్ ‘తలైవి’లో జయలలిత తల్లి పాత్రతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించా.
నా భర్త (హిమాలయ దస్సాని), నేను స్కూల్‌మేట్స్. మా ప్రేమను మొదట్లో ఇంట్లోవాళ్లు ఒప్పుకోలేదు. తర్వాత రెండు కుటుంబాలూ అంగీకరించాయి. సినిమాలకు దూరంగా ఉంటూ.. వైవాహిక జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించాలని నిర్ణయించుకున్నా. భర్త, పిల్లలతో గడపడం అంటే నాకు చాలా ఇష్టం.
నాకు ప్రయాణాలంటే ప్రాణం. ఉత్తరాఖండ్ పర్వత ప్రాంతాల్లో విహరించడం ఇంకా ఇష్టం. వారంలో ఆరురోజులు వ్యాయామం, యోగా చేస్తాను. తగినంత నిద్ర, విశ్రాంతి ఉండేలా జాగ్రత్తపడతాను. అందంతోపాటు సౌకర్యంగా ఉండే దుస్తులను ధరిస్తాను.
‘రాధేశ్యామ్’లో ప్రభాస్ తల్లిగా నటించడం మంచి అనుభవం. తను పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగినా ఎక్కడా అహంకారం కనిపించదు. చాలా బాగా కలిసిపోతాడు. మొదటిరోజు పూతరేకులు, హైదరాబాదీ స్వీట్లతో సెట్స్‌లోకి ఆహ్వానించాడు. ప్రేమగా పలకరించాడు. రెండు దశాబ్దాల తర్వాత ‘సీతారామ కల్యాణ’ అనే కన్నడ సినిమాలో నటించబోతున్నా.
“Bhagyashree | గులాబీ కలర్ చీరలో భాగ్యశ్రీ బ్యూటిఫుల్ స్టిల్స్..”