 
                                                            భీమదేవరపల్లి/అక్కన్నపేట, అక్టోబర్ 31: మొంథా తుఫాన్ ప్రభావం వల్ల కురిసిన అతి భారీ వర్షాల కారణంగా మోత్కులపల్లి వాగులో గల్లంతైన దంపతుల మృతదేహాలు ఈసంపల్లి ప్రణయ్ (28), మ్యాక కల్పన (24) శుక్రవారం ఉదయం సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మల్లంపల్లి చెరువులో లభ్యమయ్యాయి. స్థానికుల కథల మేరకు.. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండల కేంద్రానికి చెందిన ఈసంపల్లి ప్రణయ్, సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రానికి చెందిన మ్యాక కల్పనతో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ నెల 29వ తేదీన కల్పన పుట్టిన రోజు ఉంది.
పుట్టినరోజు వేడుకల సందర్భంగా కల్పన ఆమె భర్తతో కలిసి ద్విచక్ర వాహనంపై అక్కన్నపేటకు భీమదేవరపల్లి మండల కేంద్రం నుంచి బుధవారం బయలుదేరారు. అయితే అదే రోజు మొంథా తుఫాన్ కారణంగా అతి భారీ వర్షాలు కురిసాయి. ఈ కారణంగా కొత్తకొండ నుంచి మల్లారం వెళ్లే రోడ్డు తెగడంతో ప్రణయ్ దంపతులు తమ బైకును యూ టర్న్ తీసుకొని వెనుతిరిగారు. కొత్తకొండ – ధర్మారం మీదుగా అక్కన్నపేటకు బయలుదేరారు. మల్లంపల్లి దాటిన తర్వాత మోత్కులపల్లి కల్వర్టు వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. చేసేదిలేక వాగు దాటేందుకు ప్రయత్నించి అందులోనే కొట్టుకుపోయారు. మరుసటి రోజు ఉదయం పెద్ద తండా గ్రామానికి చెందిన శుక్రూ నాయక్ వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్తుండగా ద్విచక్ర వాహనం వాగులో కనిపించింది.
వెంటనే అతను పోలీసులకు సమాచారం అందించగా బైక్ నెంబర్ ఆధారంగా భీమదేవరపల్లి మండల కేంద్రానికి చెందిన ప్రణయ్ గా గుర్తించి అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. రెస్క్యూ టీం ఆధారంగా గురువారం రాత్రి వరకు పోలీసులు వాగులో గాలింపు చర్యలు చేపట్టారు. శుక్రవారం ఉదయం మల్లంపల్లి గ్రామంలోని ఊర చెరువులో వారి మృత దేహాలు లభ్యమయ్యాయి. అక్కన్నపేట ఎస్సై చాతరాజు ప్రశాంత్ మృతదేహాలకు పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం హుస్నాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
 
                            