Cancer | హైదరాబాద్, మే 30 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): క్యాన్సర్ మహమ్మారిని ముందస్తుగా గుర్తించకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఏటా కోటి మందివరకూ ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ వ్యాధి ముదరకముందే గుర్తించి సరైన చికిత్సను తీసుకొంటే లక్షలాది మంది ప్రాణాలను కాపాడొచ్చు. ఇంగ్లండ్‌లోని ఆక్స్ఫర్డ్ పాపులేషన్ హెల్త్ క్యాన్సర్ ఎపిడమాలజీ యూనిట్ పరిశోధకులు ఈ దిశగానే రెండు వేర్వేరు అధ్యయనాలను చేపట్టారు. వీటిద్వారా 19 రకాల క్యాన్సర్లను కలుగజేసే 618 ప్రొటీన్లను గుర్తించారు. వీటిపై మరిన్ని పరిశోధనలు చేస్తున్నారు. ఒకవేళ ఈ పరిశోధన ఫలితాలు ఆశాజనకంగా ఉంటే.. ఏడేండ్ల ముందుగానే క్యాన్సర్‌ను కనిపెట్టవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. క్యాన్సర్‌కు తగిన చికిత్సను ముందస్తుగా తీసుకొని లక్షలాది మంది ప్రాణాలను కాపాడొచ్చని అంటున్నారు.
బ్రిటన్‌లోని యూకే బయోబ్యాంక్ నుంచి సుమారు 44 వేల మంది రక్త నమూనాలను సేకరించిన పరిశోధకులు ఆ శాంపిళ్లలో 1,463 ప్రత్యేక ప్రొటీన్లు ఉండటాన్ని గుర్తించారు. ఈ మొత్తం రక్త నమూనాల్లో 4,900 మందికి ఆ తర్వాత క్యాన్సర్ సోకింది. దీంతో క్యాన్సర్ సోకిన వారి రక్త నమూనాల్లో ఉన్న ప్రొటీన్లు, సోకని వారి నమూనాల్లోని ప్రొటీన్లను విశ్లేషించారు. అలా చివరకు పెద్దప్రేగు, ఊపిరితిత్తులు, కాలేయం, శోషరస నాళాలకు సంబంధించిన మొత్తం 19 రకాల క్యాన్సర్లకు 618 ప్రత్యేక ప్రొటీన్లతో సంబంధం ఉన్నట్టు ప్రాథమికంగా ఓ అవగాహనకు వచ్చారు.
తమకు క్యాన్సర్ సోకే ప్రమాదమున్నదో లేదో తెలుసుకోవడానికి సాధారణంగా చాలామంది తరుచూ బ్లడ్ టెస్టులు చేసుకొంటుంటారు. అయితే ఆ రక్త నమూనాల్లో తాము కనుగొన్న 618 ప్రొటీన్లు గుర్తిస్తే ఆ వ్యక్తులకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉండొచ్చని పరిశోధకులు వెల్లడించారు. ఇది హెచ్చరిక మాత్రమేనని, క్యాన్సర్ కచ్చితంగా వస్తుందని తాము చెప్పట్లేదని గుర్తుచేశారు. దీనిపై మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉందన్నారు. తమ ప్రయోగం.. క్యాన్సర్‌ను ఏడేండ్ల ముందుగానే గుర్తించడానికి అవకాశాన్ని మాత్రమే కల్పిస్తుందని తెలిపారు.