న్యూఢిల్లీ, మార్చి 3 : భారత్లో మంగళవారం అరుదైన ఖగోళ వింత ఆవిష్కృతమైంది. ఈ సంవత్సరం అత్యంత కీలక ఘటనగా భావిస్తున్న సంపూర్ణ చంద్ర గ్రహణం దేశంలోని వివిధ ప్రాంతాల్లో స్పష్టంగా కనిపించింది. న్యూఢిల్లీ, కోల్కతా, ప్రయాగ్రాజ్, పూరీ, హైదరాబాద్ తదితర నగరాల్లో ప్రజలు ఈ ఖగోళ అద్భుతాన్ని ఆసక్తిగా వీక్షించారు. కొందరు డీఎస్ఎల్ఆర్(డిజిటల్ సింగిల్ లెన్స్ రిఫ్లెక్స్) కెమెరాలతో ఈ దృశ్యాన్ని బంధించారు.
భూమి నీడ చంద్రుడిని పూర్తిగా కమ్మేయడం వల్ల చంద్రుడు ఎరుపు లేదా రాగి వర్ణంలోకి మారడాన్నే శాస్త్రీయ పరిభాషలో ‘బ్లడ్ మూన్’ అని పిలుస్తారు. సూర్య కాంతి భూ వాతావరణం గుండా ప్రయాణించే క్రమంలో తక్కువ తరంగ దైర్ఘ్యం గల నీలి రంగు చెల్లాచెదురై, ఎక్కువ తరంగ దైర్ఘ్యం గల ఎరుపు రంగు మాత్రమే చంద్రుడి ఉపరితలాన్ని చేరుతుంది. ఫలితంగా చంద్రుడు ఎర్రగా కనిపిస్తాడు. ఇది కేవల దృశ్య మార్పు మాత్రమే.. దీంతో భూ వాతావరణానికి ఎలాంటి ప్రమాదం ఉండదని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.