వేల్పూర్: బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని ప్రతి ఒక్కరూ తమ ఓటరు వివరాలను విధిగా నమోదు చేసుకోవాలని మాజీ మంత్రి,శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి ( Vemula Prashanth Reddy ) పిలుపునిచ్చారు. బుధవారం తన స్వగ్రామమైన వేల్పూర్లో తహసీల్దార్ సమక్షంలో బూత్ లెవల్ అధికారులకు( BLOs ) తన వ్యక్తిగత ఓటరు వివరాలను ఆయన స్వయంగా అందజేశారు. ఒక ఫారాన్ని అధికారులకు సమర్పించి, రసీదుగా మరో ఫారాన్ని తన వద్ద ఉంచుకున్నారు.
నియోజకవర్గ ప్రజలందరు భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్బంగా అధికారులకు, బీఎల్వో, బీఎల్ఏలకు కీలక సూచనలు చేశారు. బీఎల్ఓలు గ్రామ పంచాయతీ కార్యాలయాలు, గుడులు , సంఘం భవనాల్లో ఒకే దగ్గర కూర్చుని వివరాలు రాయడం సరికాదన్నారు. ఇంటింటికీ స్వయంగా వెళ్లి ఓటర్లను కలిసి వివరాలు సేకరించాలని తెలిపారు.
బీఎల్ఓలు ఒకే దగ్గర కూర్చుని పనిచేస్తే ప్రజల ఓట్లు గల్లంతయ్యే అవకాశం ఉందని, ఈ విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లి, ఓటర్లను ప్రత్యక్షంగా చూసి వివరాలు సేకరించిన తర్వాతే ఆఫీసులో ఆన్లైన్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వేల్పూర్ తహసీల్దార్ అనిరుద్ , సర్పంచ్ అశోక్, ప్రతాప్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.