హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై జెన్ జీ యువత ప్రశ్నిస్తారనే సీఎం రేవంత్‌రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరలేపారని బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్‌రావు మండిపడ్డారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల కనీస వయస్సు 25 నుంచి 21 ఏండ్లకు తగ్గించాలని ముఖ్యమంత్రి ప్రతిపాదించడం కేవలం ప్రజల దృష్టి మళ్లించేందుకేనని దుయ్యబట్టారు. యువతకు అవకాశాలు ఇవ్వాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్‌కు ఉంటే మల్లికార్జున్ఖర్గేను అధ్యక్షుడిగా తప్పించి, యువ నాయకుడికి బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో సుమారు 20 లక్షల మంది విద్యార్థులకు రూ.12 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని విమర్శించారు. ఉస్మానియా యూనివర్సిటీకి వెయ్యి కోట్లు ఇస్తామన్న రేవంత్ హామీ ఏమైందని ప్రశ్నించారు. రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, విద్యా భరోసా కార్డు, ఉచిత స్కూటీ హామీలు ఏమయ్యాయని నిలదీశారు. విద్యాశాఖ నిర్వహణలో విఫలమైన సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని రాంచందర్‌రావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే యువ ఎమ్మెల్యేకు విద్యాశాఖ మంత్రి పదవి అప్పగించాలని అన్నారు.