హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ వరంగల్ సభలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య సంబంధం ఉన్నట్టు ట్లాడటంపై తెలంగాణ ప్రజలు మండిపడుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్ తెరవెనుక ఒప్పందాలు చేసుకొన్నాయని, బయటికి మాత్రం కొట్లాడుకొంటున్నట్టు నటిస్తున్నాయని విమర్శిస్తున్నారు.
యాసంగిలో తెలంగాణ రైతులు పండించిన వడ్లను కొనుగోలు చేయబోమని కేంద్ర ప్రభుత్వం మొండికేస్తే, తెలంగాణ ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ గల్లీ నుంచి ఢిల్లీ వరకు వెళ్లి కొట్లాడింది. అయినా ఫలితం లేకపోవడంతో సొంతంగా కొనుగోలు చేస్తున్నది. ఈ సమయంలో కేంద్రంలోని బీజేపీపై పోరాడాల్సిన కాంగ్రెస్ నేతలు, రాష్ట్ర ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్‌పై అడ్డగోలు వ్యాఖ్యలు చేశారు. బీజేపీని వెనుకేసుకొచ్చారు. ఇది మీ చీకటి ఒప్పందానికి సాక్ష్యం కాదా? అని రైతులు ప్రశ్నిస్తున్నారు.
ఖమ్మంలో బీజేపీ కార్యకర్త సాయిగణేశ్ ఆత్మహత్య చేసుకొంటే, ఆ ఘటనను బీజేపీ తBJP remote controlling న రాజకీయం కోసం వాడుకొని హంగామా చేసింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, తాను కలిసి ఖమ్మంలో సాయిగణేశ్ కుటుంబాన్ని పరామర్శిస్తామని ఆ సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రకటించారు. ఒక వ్యక్తి మరణిస్తే బాధిత కుటుంబాన్ని పరామర్శించడాన్ని ఎవరూ తప్పుబట్టరు. కానీ, దీనిని బీజేపీ రాజకీయ ప్రయోజనం కోసం వాడుకొని హడావుడి చేస్తున్న సమయంలో మరింత ఆజ్యం పోసేందుకు ప్రకటనలు చేయడాన్ని బట్టి రెండు పార్టీలు ఒక్కటేనని అర్థమవుతున్నదని ప్రజలు మండిపడుతున్నారు. రాహుల్ గాంధీ ఈ రెండు ప్రశ్నలపై సమాధానం ఇచ్చిన తర్వాతే టీఆర్ఎస్ గురించి మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నారు.