హైదరాబాద్, ఏప్రిల్17 (నమస్తే తెలంగాణ): బీసీలను రాజకీయంగా అణగతొక్కేందుకు బీజేపీ కుట్రలు పన్నుతున్నదని మాజీ స్పీకర్, శాసనమండలిలో బీఆర్ఎస్ ఫ్లోర్‌లీడర్ సిరికొండ మధుసూదనాచారి నిప్పులు చెరిగారు. కులగణన తర్వాతే డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్త కులగణన పూర్తిగాక ముందే డీలిమిటేషన్ చేపట్టేందుకుకేంద్రం సిద్ధమవడాన్ని నిరసిస్తూ ఢిల్లీలో బీసీ సంఘాలు శుక్రవారం మెరుపు ధర్నాకు దిగాయి. ఆంధ్ర/తెలంగాణ భవన్‌లోని అంబేదర్ విగ్రహం వద్ద డీలిమిటేషన్ పత్రాలను బీసీ నేతలు చింపివేసి నిరసన తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో బీసీ సంఘాలు, వివిధ పార్టీల బీసీ నేతలు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ తరఫున సిరికొండ మధుసూదనాచారితోపాటు మాజీమంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ పాల్గొని మాట్లాడారు. మహిళా బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన పేరుతో దేశంలో బీసీలను రాజకీయంగా అణచివేసేందుకు బీజేపీ కుట్ర పన్నిందని మధుసూదనాచారి మండిపడ్డారు. స్థానిక సంస్థల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు కల్పించే రిజర్వేషన్ల తరహాలోనే చట్టసభల్లోనూ బీసీ మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీలను దగా చేస్తున్న బీజేపీ వైఖరిపై బీసీ సంఘాలతో కలిసి పోరాడుతామని ప్రకటించారు.
దేశవ్యాప్తంగా కులగణన పూర్తయ్యాక జనాభా దామాషా ప్రకారమే బీసీ రిజర్వేషన్లను పెంచాలని మాజీమంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలని కోరారు. బీసీ వర్గాలకే ప్రధాని మోదీ ద్రోహం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మహిళా బిల్లు పేరిట బీసీలను రాజకీయంగా తొకి పెట్టాలని చూస్తున్నారని, బీసీ మహిళల ఆక్రందనను కేంద్రం పట్టించుకోవడం లేదని నిప్పులు చెరిగారు. బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం పెంచకుండా డీలిమిటేషన్ చట్టం చేస్తే ఉపయోగం ఉండదని తెలిపారు. డీలిమిటేషన్, మహిళా బిల్లుతో ఎవరికీ అన్యాయం జరుగకుండా చూసే బాధ్యత తనదేనంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించడం..
వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి పుణ్యం దకాలని తీర్థయాత్రలకు పోయినట్టుగా ఉన్నదని జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఎద్దేవా చేశారు. గత 11 ఏండ్ల పాలనలో బీసీలకు ఏమీ చేయని బీజేపీ ఇప్పుడు చేస్తామంటే నమ్మేదెలా అని నిలదీవారు. బీసీలకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని పల్లెకు పల్లెకు తిరిగి ప్రచారం చేస్తామని బీసీ సంఘం ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు, మాజీ ఎంపీ వీ హనుమంతరావు వెల్లడించారు. కార్యక్రమంలో బీసీ నేతలు గుజ్జ కృష్ణ, కుమ్మరి క్రాంతికుమార్, కులచర్ల శ్రీనివాస్, విక్రమ్‌గౌడ్, గణేశ్‌చారి, మణిమంజరి సాగర్ , కనకల శ్యాంకుర్మా, ప్రొఫెసర్ సంగని మల్లేశ్వర్, జాజుల లింగంగౌడ్, భాసర్, తారకేశ్వరి, సంధ్యారాణి, స్వర్ణగౌడ్, కౌలే జగన్నాథం తదితరులు పాల్గొన్నారు.