కరీంనగర్ కలెక్టరేట్, ఏప్రిల్ 17 : దీర్ఘకాలిక సమస్యలు సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వందలాది మంది ప్రభుత్వోద్యోగులు గళమెత్తారు. ఇచ్చిన హామీలు గుర్తుచేస్తూ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. తెలంగాణ ఉద్యోగుల జేఏసీ రాష్ట్రశాఖ ఇచ్చిన పిలుపు మేరకు శుక్ర వారం కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి కలెక్టరేట్లు, అన్ని డివిజన్లు, మండలకేంద్రాల్లోని ప్రభుత్వ కార్యాలయాల ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనలు చేపట్టారు. మండుటెండలో గంటకుపైగా ఆందోళన చేశారు. ఉద్యోగులు,ఉపాధ్యాయులు, గెజిటెడ్ అధికారులు, పెన్షనర్లు, నాలుగో తరగతి ఉద్యోగులు, డ్రైవర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఉద్యోగులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలు నెలల తరబడి పెండింగ్లో ఉన్నా స్పందించకపోవడం శోచనీయమన్నారు. డీఏలు, పీఆర్సీ, పెండింగ్, సరెండర్ లీవ్స్, మెడికల్, ఇన్సూరెన్స్ బిల్లు లు, జీపీఎఫ్ లాంటి రాజ్యాంగబద్ధ హక్కు లు అమలు చేయడంలో ప్రభుత్వం ఘోరం గా వైఫల్యం చెందిందని విమర్శించారు. తాము దాచుకున్న డబ్బుల కోసం రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయాల్సిన దుస్థితి నెలకొనడం బాధాకరమన్నారు. రాజ్యాంగబద్ధం గా రావాల్సిన హక్కులు మాత్రమే అడుగుతున్నామని, ఎవరి నుంచి ఉద్యోగులు ఉచితాలు ఆశించడం లేదని స్పష్టం చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.