టెహ్రాన్, ఏప్రిల్ 17 : ప్రపంచ దేశాలకు ఇరాన్ శుభవార్త చెప్పింది. హొర్ముజ్ జలసంధిని తాత్కాలికంగా పూర్తిగా తెరిచి ఉంచుతున్నట్టు ప్రకటించింది. లెబనాన్-ఇజ్రాయెల్ మధ్య అమెరికా మధ్యవర్తిత్వంలో తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని, ఈ ఒప్పందం అమల్లో ఉన్నంత కాలం హొర్ముజ్ జలసంధిని ప్రపంచంలోని అన్ని రకాల వాణిజ్య నౌకలకు పూర్తిగా తెరిచి ఉంచుతామని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీ పేర్కొన్నారు. ఈ జలసంధి మూసివేతతో చమురు, గ్యాస్, ఎరువులతో పాటు ముఖ్యమైన సరుకుల రవాణా నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రపంచ దేశాలకు ఇది శుభవార్తే. ‘లెబనాన్‌లో కాల్పుల విరమణకు అనుగుణంగా ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌కు చెందిన పోర్ట్‌లు మారిటైమ్ ఆర్గనైజేషన్ ఇప్పటికే ప్రకటించిన సమన్వయ మార్గంలో కాల్పుల విరమణ మిగిలిన కాలానికి హొర్ముజ్ జలసంధి గుండా అన్ని వాణిజ్య నౌకల రాకపోకలు పూర్తిగా తెరచి ఉంచాం’ అని అరాగ్చీ తెలిపారు.
ఇరాన్ ప్రకటనపై సంతోషం వ్యక్తం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. అయితే యుద్ధం ముగింపునకు ఇరాన్ తమతో ఒప్పందం కుదుర్చుకోనంత వరకు ఇరాన్ పోర్టులకు రాకపోకలు సాగించే నౌకల దిగ్బంధనాన్ని కొనసాగిస్తామన్నారు. ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య 10 రోజుల పాటు కాల్పుల విరమణ ఒప్పందం జరిగినట్టు ట్రంప్ గురువారమే ప్రకటించారు. అదే సమయంలో ఇరాన్ మద్దతుతో లెబనాన్‌లో ఉన్న హెజ్బొల్లా గ్రూప్‌కు సంబంధించి ఎలాంటి ప్రస్తావన చేయలేదు. అయితే గత కొన్ని వారాలుగా ఇజ్రాయెల్-లెబనాన్ సరిహద్దు వద్ద జరుగుతున్న కాల్పులకు తెరదించడానికి తానీ ఒప్పందం చేయించినట్టు ట్రంప్ ప్రకటించారు. ఈ ముఖ్య సమయంలో హెజ్బొల్లా సంయమనంతో వ్యవహరిస్తుందన్న ఆశాభావాన్ని ట్రంప్ వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఇరు దేశాల మధ్య చర్చలు జరిపేందుకు, అస్థిరంగా ఉన్న పరిస్థితులను చక్కదిద్ది దౌత్యపరమైన చర్యల్లో భాగస్వాములను చేసేందుకు ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, లెబనాన్ అధ్యక్షుడు జోసఫ్ ఆన్‌లను వైట్‌హౌస్‌కు ఆహ్వానించారు. వీరి మధ్య చర్చల్లో పురోగతి కన్పిస్తే ప్రస్తుతమున్న 10 రోజుల కాల్పుల విరమణను మరిన్ని రోజులు పొడిగిస్తారు. కాగా, ప్రస్తుత ఒప్పందం ప్రకారం కొనసాగుతున్న ముప్పు నుంచి ‘ఆత్మరక్షణకు అవసరమైన చర్యలు’ తీసుకునే హక్కు ఇజ్రాయెల్‌కు ఉంటుంది. మరోవైపు లెబనాన్ తన భూభాగంలో పనిచేస్తున్న హెజ్బొల్లా, ఇతర సాయధ బృందాల దాడులను నిరోధించాల్సి ఉంటుంది. ఈ ఒప్పందం ద్వారా అంతర్గత భద్రతా బాధ్యతను లెబనాన్ రాష్ట్ర భద్రతా దళాలపై మోపారు. అంతేకాకుండా అపరిష్కృత సమస్యలపై అమెరికా మధ్యవర్తిత్వంతో చర్చలు కొనసాగించాలని కూడా నిర్ణయించారు.
ప్రపంచంలోని అత్యంత కీలకమైన సముద్ర మార్గాల్లో హొర్ముజ్ జలసంధి ఒకటి. ఇది ప్రపంచ చమురు, గ్యాస్ రవాణాలో గణనీయమైన వాటాను కలిగి ఉంది. ఈ జలమార్గంలో సుమారు 50 రోజులుగా ఏర్పడిన ప్రతిష్టంభనతో ప్రపంచ ఇంధన మార్కెట్లు అల్లాడాయి. నౌకా రవాణా భద్రతపై కూడా తీవ్ర ఆందోళనలు నెలకొన్నాయి. ఇప్పటికే ప్రపంచంలోని పలు దేశాల్లో ఇంధన, గ్యాస్, ఎరువులు, ఎసిటిలిన్ కొరత ఏర్పడి వాటి దుష్పరిణామాలను చవిచూస్తున్నాయి. ప్రస్తుతం ఈ జలసంధిని పూర్తిగా తెరచి ఉంచడం తాత్కాలికమే అయినప్పటికీ ఇది ప్రపంచ దేశాలకు గొప్ప ఉపశమనం కలిగిస్తుందనడంలో సందేహం లేదు. కాగా, జలసంధి మార్గాన్ని తెరవడంతో అక్కడ నిలిచిపోయిన నౌకలు ఒక్కొక్కటిగా తమ గమ్య స్థానాలకు బయలుదేరినట్టు సమాచారం.