న్యూఢిల్లీ: పోరాడింది శూన్యం. కానీ కోతలు మాత్రం ఘనం. పార్లమెంట్ సాక్షిగా ఎంపీ బండి సంజయ్(MP Bandi Sanjay) ఓవర్ యాక్షన్ చేశారు. పార్లమెంట్ దేవాలయం అని, తమకు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదించిందని చెబుతూ లోక్‌సభలో ఇవాళ శిరస్సు వంచి నమస్కరించారు. తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిశలు పోరాడిన బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తూ బండి సంజయ్ దొంగ నాటకాలు ఆడారు. ప్రధాని మోదీ మెప్పు కోసమే బండి సభలో డైలాగ్‌లు కొట్టేశారు. ఆ పరంపరలోనే ఆ బీజేపీ నేత దొంగ నమస్కారాలు చేశారు.
అవిశ్వాసం తీర్మానంపై బండి మాట్లాడుతూ కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ సర్కార్‌పై అనుచిత విమర్శలు చేసే ప్రయత్నం చేశారు. తెలంగాణను బర్బాద్ చేశారని, నాశనం చేశారని బండి అసంబద్ధం ప్రేలాపనలు చేశారు. బీఆర్ఎస్ నేతలపై బండి వ్యక్తిగతంగా విమర్శలకు దిగారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు బర్బాద్ అవుతున్నారని సంజయ్ ఏ ఆధారంలేని విమర్శలు చేశారు. తెలంగాణలో 24 గంటలు కరెంట్ ఇస్తున్నారు, కానీ ఇస్తలేరని బండి ఆరోపించారు. తెలంగాణ రైతులకు 24-7 కరెంట్ ఇస్తోంది కేసీఆర్ సర్కారు మాత్రమే. తెలంగాణ రైతుల బాగుబాగోలు చూసుకుంటున్న సీఎం కేసీఆరే.. ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. కానీ బండికి ఆ స్కీమ్‌లు కనిపించలేదు.
మిషన్ భగీరథ్ పథకంపై కూడా బండి అసత్య ఆరోపణలు చేశారు. రాష్ట్రానికి వేల కోట్లు ఇచ్చినట్లు పేర్కొన్న ఆయన.. అసలు ఆ ప్రాజెక్టుకు ఇచ్చింది తక్కువే అన్న వాస్తవాన్ని మరిచారు. మిషన్ భగీరథ్ తో రాష్ట్ర ప్రజలకు స్వచ్ఛమైన శుద్ధ జలాలను అందించింది కేసీఆర్ ప్రభుత్వమే. గడిచిన 8 ఏండ్లలో కేంద్రం ఇచ్చింది ఏమీ లేదు. కానీ బండి మాత్రం తన ప్రసంగంలో తెలంగాణకు ఎంతో ఇచ్చినట్లు చెప్పారు. రావాల్సిన డబ్బలు ఇవ్వకుండా.. కేంద్రంలోని పెద్దలే పైసలు దొబ్చారు.
డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వడం లేదని బండి మరో కూత కూశారు. కానీ దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇవ్వలేనన్ని డబుల్ బెడ్రూం ఇండ్ల తెలంగాణ సర్కార్ ఇచ్చింది. అత్యద్భుతంగా నిర్మించిన ఆ ఇండ్లను ప్రతి నియోజకవర్గంలోని పేదలకు అందజేసింది కేసీఆర్ ప్రభుత్వమే. పేదల ఆకలి తీర్చలేని బీజేపీ ప్రభుత్వం బండితో అన్నీ అబద్దాలే చెప్పించింది. బియ్యం అమ్ముకున్నారని నిరాధారమైన ఆరోపణలు చేశారు. కరోనా కష్ట సమయంలో కేసీఆర్ విజన్ వల్లే.. రాష్ట్రంలోని ప్రతి పేదకు అన్నం దొరికింది. ఇప్పటికీ అన్ని రేషన్ షాపుల్లోనూ ఉచితంగా బియ్యం పంపిణీ జరుగుతోంది.
బండి ప్రసంగంలో ఆవేశం తప్ప.. ఆలోచన లేదు. అనునిత్యం రైతు క్షేమం కోసం పరితపించిన కేసీఆర్ విధానశైలిపై బీజేపీ నేత ఒక్క మాట కూడా మంచిగా మాట్లాడలేకపోయారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రగతిని చూసి .. కరీంనగర్ ఎంపీ ఓర్వలేకపోయారు. లోక్‌సభలో తమ సభ్యుల బలాన్ని చూసి మురిసిపోయిన ఆ ఎంపీ తన అనాలోచిత సరళిని మాత్రమే ప్రదర్శించారు.